కరోనా థర్డ్‌వేవ్‌: రానున్న 125 రోజులు చాలా క్లిష్టమైనవి

Niti Aayog VK Paul Said Next 125 Days Critical Not Reached Herd Immunity Yet - Sakshi

హెచ్చరించిన నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌

లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత మాస్క్‌ వాడకం 74 శాతం తగ్గిపోయింది

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. రానున్న 125 రోజులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్‌కు వ్యతిరేకంగా భారతదేశం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. వైరస్‌ సంక్రమణ కొత్త వ్యాప్తి అవకాశాలను తోసిపుచ్చలేమని.. వైరస్‌ వ్యాప్తికి రాబోయే 125 రోజులు చాలా క్లిష్టంగా ఉంటాయని సూచించింది. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ, ‘‘వైరస్‌ సంక్రమణను వ్యాప్తి చెందకుండా ఆపాలి. కోవిడ్‌ కట్టడికి అనుకూలమైన ప్రవర్తను అలవాటు చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని’’ తెలిపారు. 

ఈ సందర్భంగా వీకే పాల్‌ మాట్లాడుతూ.. ‘‘మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించలేదు. ప్రస్తుతం వైరస్‌లో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం వాటిని అడ్డుకోవాలి. సురక్షితమైన జోన్‌లో ఉండటానికి కోవిడ్ కట్టడికి అనుకూలమైన ప్రవర్తనను అనుసరిస్తే ఇది సాధ్యమవుతుంది" అన్నారు. కోవిడ్‌పై పోరులో రాబోయే 125 రోజులు భారతదేశానికి చాలా క్లిష్టమైనవి అని అన్నారు వీకే పాల్‌.

థర్డ్‌వేవ్‌ వైపు ప్రపంచ పయనం: వీకే పాల్‌
అనేక దేశాలలో కోవిడ్ పరిస్థితి మరింత దిగజారిపోతోందని, ప్రపంచం థర్డ్‌ వేవ్‌ వైపు పయనిస్తోంది అని డాక్టర్ పాల్ హెచ్చరించారు. ‘‘మనదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడానికి మేం సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్ మధ్య ఉన్న సమయం వినియోగించుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెచ్చరికను జారీ చేసింది. దాని నుంచి మనం నేర్చుకోవాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాలతో థర్డ్‌ వేవ్ గురించి చర్చించారు’’ అని డాక్టర్‌ పాల్‌ తెలిపారు.

జాయింట్ సెక్రటరీ (ఆరోగ్య) లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘అనేక దేశాలలో కోవిడ్ కేసులు మరోసారి పెరగడం ప్రారంభించాయి. మన పొరుగు దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌లలో కూడా కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. మలేషియా, బంగ్లాదేశ్‌లలో థర్డ్‌ వేవ్‌ ప్రభావం సెకండ్‌ వేవ్‌ కన్నా అధికంగా ఉంది’’ అన్నారు. 

కోవిడ్ సంబంధిత ఆంక్షలు సడలించినప్పటి నుంచి భారతదేశంలో మాస్క్‌ల వాడకం బాగా క్షీణించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో మాస్క్‌ వాడకంలో 74 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు అంచనా వేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top