
కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఆమె మరణ శిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని.. నిమిష శిక్షను తప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది.
ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆరా తీసింది. అయితే తాము (కేంద్రం) చేయగలిగినదంతా చేశామని, యెమెన్‌తో భారత్‌కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్‌కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్‌మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు.
దీంతో జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ప్రాణాలు పోతే గనుక చాలా బాధాకరమని అన్నారాయన. అయితే అనధికారిక మార్గాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసి వెంటనే సంప్రదించాలని ఆయన ఏజీకి సూచిస్తూ.. ఈ పిటిషన్‌లో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
యెమెన్‌లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషా ప్రియాకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్‌లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన వ్యాపార భాగస్వామి(బాధితుడి) తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను మరణించాడని తేలింది.

ఈ కేసులో చివరగా మిగిలిన ఆశ బ్లడ్‌మనీ ఒక్కటే. షరీయత్ చట్టం ప్రకారం ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే.. బాధితుడి కుటుంబానికి $1 మిలియన్ (రూ. 8.3 కోట్లు) చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.