
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి.

భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
క్షమాధనం అంటే..
హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.
నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.
వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!
నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది.
👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్‌మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు
👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది.
👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.
👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.
👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.
👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.
👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.
👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.
👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది.
బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.
👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్‌మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.
కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.
బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!
సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.
తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.
సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్‌కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.
పెండింగ్‌లో..
ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.
నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది.