
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీకి భారత సిమ్ కార్డులను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక నేపాలీ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియా(43) బీఎస్సీ చదువుకున్నాడని, మహారాష్ట్ర, ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని లాతూర్‌లో నమోదైన తన ఆధార్ కార్డును ఉపయోగించి బీహార్, మహారాష్ట్రల నుండి 16 సిమ్ కార్డులను కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తరువాత వాటిని గూఢచర్యంతో సంబంధం ఉన్న కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆగస్టు 28న స్పెషల్ పోలీసు బృందం లక్ష్మీ నగర్‌లోని విజయ్ బ్లాక్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లాహోర్, బహవల్పూర్, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల నుండి ఐఎస్‌ఐ ఆపరేటర్లు పదకొండు సిమ్‌లను ఆపరేట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితుడు 2024లో నేపాలీ మధ్యవర్తి ద్వారా ఐఎస్‌ఐ హ్యాండ్లర్లను సంప్రదించాడని దర్యాప్తులో తేలింది. అమెరికా వీసా, విదేశాల్లో జర్నలిజంలో అవకాశాల హామీతో అతన్ని ఐఎస్‌ఐ ఏజెంట్లు ఆకర్షించారు. డీఆర్‌డీఓ, ఆర్మీ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిని అతనిని అప్పగించారని స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ కౌశిక్ తెలిపారు.
నిందితుడు సిమ్ కార్డులను భారతదేశం నుండి ఖాఠ్మండుకు అక్రమంగా రవాణా చేసి, తరువాత ఐఎస్ ఐహ్యాండ్లర్లకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 2017లో ప్రభాత్ చౌరాసియా ఖాఠ్మండులో ఒక లాజిస్టిక్స్ కంపెనీని ప్రారంభించాడు. అది ఆర్థిక నష్టాల కారణంగా మూతబడింది. దీంతో సంపాదన కోసం ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుని నుంచి పలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియాపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.