 
													ముంబై: ఆడిషన్స్ పేరుతో చిన్నారులను కిడ్నాప్ చేసి, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముంబై చిత్ర నిర్మాత ‘రోహిత్ ఆర్య’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రోహిత్ ఆర్య అప్సర మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నాడు. వాటిల్లో విద్యాశాఖలో పూర్తి చేసిన ప్రాజెక్టు నిమిత్తం రోహిత్ ఆర్యకు మహా ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఆ మొత్తం ఇవ్వలేదని కారణంతో రోహిత్ ఆర్య పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్
2022-2023లో ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్ అనే పట్టణ పారిశుధ్య డ్రైవ్ ప్రాజెక్ట్ బాధ్యతల్ని నాటి మహరాష్ట్ర ప్రభుత్వం రోహిత్ ఆర్యకు అప్పగించింది. అప్సర మీడియా పేరుతో ఆ ప్రాజెక్ట్ పనుల్ని చేసింది. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో శుభ్రతా చర్యలు సూచించటం, రిపోర్ట్ చేయటం, విద్యార్థులు,సిబ్బందికి అవగాహన కల్పించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2023 జూన్ 30న నాటి ప్రభుత్వం రూ. 9.9 లక్షలు చెల్లించింది.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహరాష్ట్రలో ప్రభుత్వం మారడం, నూతన ప్రభుత్వానికి రోహిత్ ఆర్య చేస్తున్న ప్రాజెక్ట్‌పై అసంతృప్తిని వ్యక్తి చేసింది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసింది. ప్రభుత్వం నిర్ణయంతో రోహిత్ ఆర్యకు భారీ మొత్తంలో నష్టం వచ్చింది.
సంవత్సరం తర్వాత మరోసారి
ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఏడాది తర్వాత ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, ఈసారి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని కోరాడు. దీనికోసం రూ. 2.42 కోట్లు డబ్బు ఇవ్వాలని మరొక డిమాండ్‌ను సమర్పించాడు. అదే సమయంలో ‘ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్’ డైరెక్టర్ హోదాలో ఆర్య పాఠశాలల నుంచి రిజిస్టేషన్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీజును వసూలు చేయడానికి ఆర్యకు అధికారం లేదని ప్రభుత్వం తెలిపింది.
పైగా,పాఠశాలల నుంచి వసూలు చేసిన డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించనని హామీ ఇచ్చి అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. కానీ ఆర్య డబ్బును జమచేయకపోగా.. అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలో ఆడిషన్స్ పేరుతో గురువారం పిల్లల్ని కిడ్నాప్ చేసి మహరాషష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. పిల్లల్ని విడిపించేలా పోలీసులు ఆర్యతో చర్చలు జరిపారు. ఆ సమయంలో పిల్లల ప్రాణాలు తీసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం రోహిత్ ఆర్యను ఆస్పతత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య కన్నుమూశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
