అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన | Modi announces compensation for victims of Lucknow coaching center fire | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Jun 22 2026 7:02 PM | Updated on Jun 22 2026 7:31 PM

Modi announces compensation for victims of Lucknow coaching center fire

యూపీ:  లక్నోలోని కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. " లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు". అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు,  గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాగా ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం లక్నోలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో్ంది.

ప్రమాదం ఎలా జరిగింది?

ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

అయితే అగ్నిమాపక దళం వెంటనే స్పందించినప్పటికీ అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement