
నెలలు నిండాయి, ఇటీవలే ఘనంగా సీమంతం వేడుక చేశారు. కొడుకో, కూతురో పుడితే ఇల్లంతా సందడిగా ఉంటుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వారి ఆశలను తుంచేసింది.
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని తల్లీ బిడ్డ హైటెక్ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ, కడుపులో శిశువు మృత్యువాత పడ్డారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ కాటికి పోయారని ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. దొడ్డ తాలూకా సింగేనహళ్లి నివాసి సుశి్మత (24) మొదటిసారి గర్భం దాల్చింది. దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చూపించగా 7న కాన్పు తేదీ ఇచ్చారు. అయితే మంగళవారంనాడు సుస్మితకు ఊపిరి ఆడడం లేదని కుటుంబీకులు ఆస్పత్రికి తీసకువచ్చారు.
ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో నర్స్ మాత్రలు ఇచ్చి ఏమీ కాదని చెప్పింది. దీంతో వారు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం పొద్దున హఠాత్తుగా సుశి్మత ఆరోగ్యం క్షీణించి మరణించింది. త్వరలో కాన్పు అయి పండంటి బిడ్డను చూస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యుల న్లిక్ష్యం, సమయానికి డాక్టర్ లేకపోవడం వల్లే గర్భిణి, కడుపులోని బిడ్డ చనిపోయారని దుయ్యబట్టారు. తరువాత పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
బెంగళూరులో బాలింత..
యశవంతపుర: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రసవమైన గంటలో బాలింత మరణించిన ఘటన బెంగళూరులో జరిగింది. బాలింత మృతికి వైద్యుల అలసత్వం కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని కోణనకుంట క్రాస్‌లోని అస్ట్రాం ఆస్పత్రిలో మంగళవారం మండ్యకు చెందిన తను (23) అనే గర్భిణి ప్రసవం కోసం చేరింది. వైద్యులు తనుకు సిజేరియన్ కాన్పు చేశారు. గంట తరువాత తను పరిస్థితి విషమించి కన్నుమూసింది. పుట్టిన గంటకే శిశువు అనాథ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు.