గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు..

Man who Braved Cyclone Michaung to Travel 200 KM - Sakshi

ఇటీవలి మిచౌంగ్‌ తుపాను.. దేశంలోని దక్షిణాదిని అతలాకుతలం చేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు పలు సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలోనే ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కడంబత్తూర్‌కు చెందిన మునుస్వామి(40) మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. 

ల్యాబ్‌ టెక్నీషియన్‌ అయిన మునుస్వామి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలులు, భారీ వర్షం, వరదలతో నిండిన రోడ్లను సైతం లెక్కచేయక దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మునుసామి.. దేశంలోని ప్రముఖ రక్త స్టెమ్ సెల్ దాతల ప్రభుత్వేతర సంస్థ డెట్రాయ్‌(డీఏటీఆర్‌ఐ)లో పని చేస్తున్నారు. ఈ సంస్థ రక్త రుగ్మతలతో బాధపడుతున్నవారికి సహాయం అందిస్తుంది.

క్యాన్సర్‌ బాధితల శిశువుకు చికిత్సలో మూలకణాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతకు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్‌ను అందించడానికి మునుస్వామి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ దాత బాధిత చిన్నారికి తన ఎముక మజ్జను దానం చేయడానికి అండమాన్ నుండి వచ్చి, చెన్నై నగరంలోని పాత పెరుంగులత్తూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారు. 

ఈ సందర్భంగా డెట్రాయ్‌ ఇన్‌ఛార్జి సుమతి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ బోన్ మ్యారో డొనేషన్ రెండు విధాలుగా చేయవచ్చు. బాధిత కుటుంబంలో వారి లేదా జన్యుపరమైన పోలిక కలిగిన వారి నుంచి దీనిని సేకించవచ్చు. అయితే ఆ రెండేళ్ల బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. తన బోన్ మ్యారోను దానం చేసేందుకు ఒ​క వ్యక్తి ముందుకు వచ్చారన్నారు. వైద్య ప్రక్రియలో తాము రక్త కణాలను వెలికితీసేందుకు, ఐదు రోజుల పాటు దాతకు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు గ్యాప్ ఉండకూడదు. అప్పుడే బాధితులకు అవసరమైన మూలకణాలను సేకరించగలమని అన్నారు. ఇలా సంగ్రహించిన స్టెమ్ సెల్ ప్రాసెస్ చేశాక, దానిని బాధితులకు ఉపయోగిస్తామన్నారు. 

తుఫానుకు ముందు రోజున దాతకు మొదటి డోస్ ఇచ్చాం.  తుపాను కారణంగా రెండవ డోస్ ఇవ్వడంపై ఆందోళన చెందాం. దాత ఉంటున్న ప్రాంతంలోని వైద్య నిపుణుల సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మునుసామి ముందుకు వచ్చారు.  ఈ సందర్భంగా మునుసామి మాట్లాడుతూ చిన్నారికి చికిత్స ఆలస్యమైతే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. దానిని గుర్తించినంతనే ఈ సాహసానికి దిగాను.  మోటార్ సైకిల్‌పై ఇంటి నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరాను. జాతీయ రహదారులు ఎక్కడికక్కడ జలమయమంగా ఉన్నాయి. రోడ్లు కనిపించడం లేదు. పెరంబక్కం వైపు వెళ్ళాను. చెన్నైకి వెళ్లే హైవేలను కనెక్ట్ అయ్యేందుకు ఒక అండర్ పాస్ దాటాలి. ఇది జలమయంగా ఉండటంతో మరో మార్గంలో వెళ్లాను. శ్రీపెరంబుత్తూరు నుండి పూనమల్లి రోడ్డు మీదుగా చెన్నై ఔటర్ రింగ్ రోడ్డులోకి ప్రవేశించానని మునుసామి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

కాగా పాత పెరుంగళూరు రహదారిని కలిపే వంతెన జలమయం కావడంతో పోలీసులు అటువైపు వెళ్లడాన్ని అడ్డుకోవడంతో బైక్‌ని వంతెనపై ఆపి నడిచానని, అలా మూడు కిలోమీటర్ల నడిచి, తరువాత ఈదుకుంటూ చివరికి దాత ఇంటికి చేరుకుని, దాతకు ఇంజిక్షన్‌ ఇచ్చానని తెలిపారు. తరువాత దాత కుటుంబ సభ్యులు వర్షం తగ్గేవరకూ ఇంటిలోనే ఉండాలని కోరినప్పటికీ, మునుస్వామి తన ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఆ మరుసటి కూడా రోజు దాతకు మునుస్వామి ఇంజెక్షన్ ఇచ్చాడు. కదంబత్తూర్‌లోని మునుస్వామి ఇంటి నుండి దాత ఇల్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది కూడా చదవండి: రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top