ఓపీఎస్ పునరుద్ధరణ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
కాంట్రాక్టు కార్మికులు, జీవికా దీదీల క్రమబద్ధీకరణ
మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మహాగఠ్‌బంధన్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాగఠ్‌బంధన్ తమ ఎన్నికల ప్రణాళికను(మేనిఫెస్టో) మంగళవారం విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, పాత పెన్షన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ‘బిహార్ కా తేజస్వీ ప్రణ్’పేరిట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 32 పేజీల ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమి నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ మేనిఫెస్టోలో ప్రధానంగా 20 అంశాలు ఉన్నట్లు తేజస్వీ యాదవ్ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు గ్యారంటీ ఇస్తూ 20 రోజుల్లోగా చట్టం తీసుకొస్తామన్నారు. ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్‌ను 20 నెలల్లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. జీవికా దీదీలను క్రమబద్ధీకరిస్తామని, నెలకు రూ.30 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిటీ, ఐదు ఎక్స్‌ప్రెస్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఐటీ పార్కులు, సెజ్‌లు, పాడి పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.
నేర రహిత, అవినీతి రహిత బిహార్‌ను ప్రజలు కోరుకుంటున్నాయని స్పష్టంచేశారు. ఎన్డీఏ సర్కార్‌కు బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. అభివృద్ధి పట్ల ఎన్డీఏకు ఒక విజన్ లేదన్నారు. ఇప్పటిదాకా కనీసం మేనిఫెస్టో విడుదల చేయలేదని ఆక్షేపించారు.
వక్ఫ్(సవరణ) చట్టం అమలు చేయం..
బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద వక్ఫ్(సవరణ) చట్టాన్ని అమలు చేయబోమని తేజస్వీ యాదవ్ తేల్చిచెప్పారు. వక్ఫ్ ఆస్తుల అంశాన్ని మరింత పారదర్శకంగా మారుస్తామన్నారు. ఆ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోద్‌గయలోని బౌద్ధ ఆలయాలను బౌద్ధ సామాజిక వర్గానికి అప్పగిస్తామని తెలిపారు. మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాపాడుతామని వివరించారు. అంతేకాకుండా బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎౖMð్సజ్ చట్టాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్య నిషేధంపై పునరాలోచన చేయనున్నట్లు పరోక్షంగా స్పష్టంచేశారు. కల్లుపై నిషేధం ఎత్తివేస్తామని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించడానికి ఎస్సీ/ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టం తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వివరించారు.


