అంబులెన్స్‌లో కరోనా రోగి.. చెరుకు రసం కోసం వచ్చిన డ్రైవర్

Madhya Pradesh Ambulance With Covid Patient Stops At Juice Shop - Sakshi

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటన

ఆస్పత్రి సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం

భోపాల్‌: కరోనా వైరస్‌ మరోసారి కోరలు చాచింది. సెకండ్‌ వేవ్‌ మరింత భయంకరంగా ఉంది. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా డెయిలీ లక్షకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా లాభం లేకుండా పోతుంది. కోవిడ్ అంటే జనాల్లో భయం లేదు. వ్యక్తిగత శుభ్రత, శానిటైజర్‌ వాడకం, మాస్క్‌ ధరిచడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వైరస్‌ను చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నారు. సామాన్యులే అనుకుంటే జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్య సిబ్బంది కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా కోవిడ్‌ రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి వచ్చి... చెరకు రసం ఆర్డర్‌‌ చేశాడు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కోవిడ్‌.. నాకు కాదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రాష్ట్రంలోని షాడోల్ జిల్లాలో సదరు అంబులెన్స్‌ సిబ్బంది కోవిడ్‌ బారిన పడిని ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తి‌కి టెస్టులు చేయించడం కోసం రాజేంద్ర టాకీస్‌ స్క్వయర్‌ సెంటర్‌లోని ప్రైవేట్‌ ల్యాబ్‌కు తీసుకెళ్తున్నారు. 

ఈ క్రమంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ రోడ్డు పక్కన ఉన్న ఓ చెరకు రసం బండి దగ్గర వాహనాన్ని‌ ఆపాడు. దాంట్లో నుంచి పీపీఈ కిట్లు ధరించిన అంబులెన్స్‌ డ్రైవర్‌​ కిందకు దిగి.. చెరకు రసం బండి సమీపానికి వెళ్లి.. మాస్క్‌ తొలగించి.. ఆర్డర్‌ ఇచ్చాడు. దీని గురించి అక్కడ ఉన్న వారు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘‘అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కరోనా. నాకు కాదు’’ అంటూ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగ వైరలయ్యింది.

ఇక సదరు అంబులెన్స్‌ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందినదిగా గుర్తించారు. ఇక మధ్యప్రదేశ్‌లో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం (ఏప్రిల్‌ 14, 2021) ఉదయం 6 గంటలకు వరకు సుమారు 60 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించారు.

చదవండి: దేశాన్ని హడలెత్తిస్తోన్న కరోనా సెకం‍డ్‌ వేవ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top