
ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులపైనా ఈసీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం శాఖ కార్యదర్శులతోపాటుగా, పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సాధారణ పరిపాలన విభాగాల కార్యదర్శులను కూడా తొలగించింది.
గతంలోనూ చర్యలు
2016 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్ డీజీపీకి ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించడం గమనార్హం. తాత్కాలికంగా డీజీపీ రాజీవ్ కుమార్‌కు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగించాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఈసీ సూచించింది. ఆయనకు జూనియర్‌గా ఉన్న మరో అధికారికి డీజీపీ బాధ్యతలివ్వాలని కోరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
వీరికి రెండు విధులు
గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు సంబంధిత రాష్ట్రాల సీఎం కార్యాలయాల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎన్నికల సంబంధ విధుల అమలులో ఎంతో కీలకమైన నిష్పా క్షికత, తటస్థత కొరవడే ప్రమాదముందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
బీఎం కమిషనర్ తొలగింపు
ఎన్నికల సమయంలో మూడేళ్లు ఒకే చోట బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాల్లో విధుల్లో ఉన్న వారిని ఎన్నికల సంబంధ విధుల నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సూచనలను పాటించకపోవడంపై ఈసీ అసంతృప్తిగా ఉంది. దీంతో, బృహన్ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్‌తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలిచ్చింది. ఇతర కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు, అదనపు, ఉప కమిషనర్లను కూడా బదిలీ చేయాలని కోరింది.