భయం లేకే కోవిడ్‌ వ్యాప్తి

Lack of fear of disease behind Maharashtra Kovid growth - Sakshi

మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం స్పష్టత

వైరస్‌ పట్ల ప్రజల ఉదాసీనతే కారణమని వెల్లడి

న్యూఢిల్లీ: కోవిడ్‌ వైరస్‌ సోకుతుందన్న భయం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్‌ వెరసి మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ఆదివారం తెలిపింది. కోవిడ్‌ కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం గతవారంలో  రాష్ట్రంలో పర్యటించింది.

చాలా అంశాలున్నాయి..
కోవిడ్‌ వ్యాప్తికి నిర్ణీత కారణాన్ని చెప్పలేమని, కేసుల పెరుగుదల చాలా అంశాల మిళితం వల్ల జరుగుతోందని చెప్పారు. వాటిలో రోగం పట్ల భయం లేకపోవడం, మహమ్మారి పట్ల ఉదాసీనత, సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించలేకపోవడం, ఎన్నికల్లో సరైన కోవిడ్‌ నిబంధనలు పాటించలేకపోవడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడం, పాఠశాలలు తెరవడం, గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేయడం వంటి కారణాల వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్రం నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుత కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేని రోగులే ఉంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడంలో విఫలం కావడం కూడా కారణమని చెప్పింది. ఇప్పటికైనా మేలుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.

డాక్టర్లలోనూ ఉదాసీనత..
డాక్టర్లలో ప్రత్యేకించి ప్రైవేటు డాక్లర్లు కొన్ని కేసులను కేవలం ఫ్లూగా కొట్టిపారేస్తూ టెస్టుల వరకూ వెళ్లనివ్వట్లేదని.. కోవిడ్‌ రోగులను  జూనియర్‌ డాక్టర్లకు వదిలేస్తున్నారని దీంతో కోవిడ్‌ తీవ్రత పెరుగుతోందని కేంద్రం  పేర్కొంది. కోవిడ్‌ నియంత్రణ కోసం కంటితుడుపు చర్యలు తీసుకోకుండా పని చేయాలని, ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపింది. ఎంత మందికి వ్యాక్సినేషన్‌ చేస్తామన్నారో,  ఎందరికి వ్యాక్సిన్‌ వేశారో  చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని మహారాష్ట్రలో పర్యటించిన బృందం తెలిపింది. కేంద్రం స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే ఈ వివరాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top