కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్‌కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..
ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్‌కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్‌ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్‌ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్‌ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.
మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్‌సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.
అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.


