లండన్: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మొదటిసారిగా బుధవారం భారత్ పర్యటనకు రానున్నారు. మంగళవారం రాత్రి ఆయన తన ప్రతినిధి బృందంతో కలిసి హీత్రూ ఎయిర్‌పోర్టులో విమానమెక్కారు. ప్రధాని మోదీ ఆహ్వనం మేరకు భారత్ వస్తున్న స్టార్మర్ రెండు రోజులపాటు పర్యటిస్తారు. భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది.
ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఇద్దరు నేతలు కీలక ప్రసంగాలు చేయనున్నారు. రెండు దేశాల మధ్య జూలైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్‌లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది.
దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్‌కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి.


