
చెన్నై,సాక్షి: మాటలకందని కరూర్ విషాదంపై తమిళగ వెట్రి కగళం అధ్యక్షుడు విజయ్ ఇస్తానన్న రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా తమకేం వద్దని, తొక్కిసలాటలో మరణించిన తన చెల్లల్ని తిరిగి తనకు ఇవ్వాలని ఓ సోదరి కన్నీటి పర్యంతమవుతున్నారు.
శనివారం రాత్రి విజయ్ తమిళనాడు కరూర్‌లో నిర్వహించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 40మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కరూర్‌కు చెందిన బృందా ఒకరు.
బృందాకు హీరో విజయ్ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానమే బృందా ప్రాణాలు తీసింది. నిన్న తానుండే ఏరియాలో విజయ్ సభ నిర్వహిస్తున్నాడని తెలుసుకుంది. ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది. రెండేళ్ల కొడుకును తన సోదరి వద్ద వదిలి తన హీరోని చూసేందుకు గంపెడాశతో విజయ్ మీట్ ద పీపుల్ వేదిక వద్దకు వెళ్లింది. సభలో విజయ్‌ను కలుసుకుని, ఆయనతో సెల్ఫీ దిగాలని అనుకుంది. కానీ కొన్ని గంటల తర్వాత, బృందా కరూర్ తొక్కిసలాటలో మరణించింది. ఆ ర్యాలీలో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మంది గాయపడ్డారు.
ఇక కరూర్ విజయ్ సభలో శనివారం సాయంత్రం సమయంలో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు రావడంతో బృందకు ఆమె సోదరి ఫోన్ చేస్తూనే ఉంది. అట్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదివారం ఉదయమే బృంద మరణించినట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు.
‘నా సోదరి తన బిడ్డను నా దగ్గరే వదిలేసి విజయ్ ర్యాలీకి వెళ్తానని చెప్పింది. మేము సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేశాం. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం.. ఆమె నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. సాయంత్రం పది గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఈ రోజు ఉదయం నా సోదరి భర్త ఆమె ఫొటోతో ప్రభుత్వ అధికారుల్ని కలిశారు. ఆ తర్వాతే కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారిలో ఆమె ఉన్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం ప్రకటించారు. ఆ మొత్తం మాకెందుకు. చనిపోయిన నా సోదరిని ఇవ్వండి చాలు అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది.