
చట్టాన్ని అమలు చేయడమే న్యాయస్థానాల విధి
సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని అమలుచేయాలంటే న్యాయస్థానాలు ఎలాంటి భయాలు, రాగద్వేషాలు లేకుండా తమ విధి నిర్వహణకు అంకితం కావాలని సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో జస్టిస్ నాగరత్న పాల్గొని ప్రసంగించారు.
‘‘చట్టం అనేది నిబంధనల సమాహారం మాత్రమే కాదు. పేదలు, ధనికులు, కిందిస్థాయి, పైస్థాయి, కులం, మతం, లింగ భేదాలకు అతీతంగా ఎలాంటి నమ్మకాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టం ముందు అందరూ సమానులే అనే భావనతోనే చట్టాన్ని అమలుచేయాలి. శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే కోర్టులు, న్యాయ సేవలు అందుబాటులో ఉంటాయనే అపోహ తొలగిపోవాలి.
ఈ తప్పుడు భావనను న్యాయవాదులు సైతం మార్చగలరు’’అని జస్టిస్ నాగరత్న అన్నారు. ఈ సందర్భంగా యువ లా విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘నిజమైన బాధితుల కేసులను వాదనల కోసం స్వీకరించాలి. అప్పుడు బాధితులకు సాంత్వన, న్యాయం చేకూర్చే వారధులుగా న్యాయవాదులు కీర్తిగడిస్తారు. రాజ్యాంగానికి పౌరులకు, న్యాయానికి ప్రజలకు మధ్య సైతం అడ్వొకేట్లు సేతువుగా నిలబడాలి.
న్యాయవాద వృత్తి అనేది మార్పునకు వాహకంగా ఉండాలి. ముఖ్యంగా భారతీయ సమాజంలో చూస్తే చరిత్రాత్మకంగా వివక్ష, వెలివేతకు గురైన, అసమానత కారణంగా అన్యాయమైన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు న్యాయవాద వృత్తిని సాధనంగా ఉపయోగించుకోవాలి’’అని అన్నారు. ‘‘సుపరిపాలనలో చట్టాలను సమగ్రస్థాయిలో అమలుచేయడం అనేది అత్యంత ఆవశ్యకం.
న్యాయపాలన అనేది కూడా కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే భారత్‌లో న్యాయవ్యవçస్థ పూర్తి స్వతంత్రంగా అమలవుతోంది. ఈ కోర్టుల వ్యవస్థకు స్వతంత్ర బార్ వ్యవస్థ చేదోడువాదోడుగా నిలిచింది’’అని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని అమలుచేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న నేతలు, ధర్మాసనంలో తీర్పులిచ్చే న్యాయమూర్తులేకాదు న్యాయవాదులకూ ఉంది. రాజ్యాంగాన్ని అడ్వొకేట్ చేయాల్సిన విధ్యుక్తధర్మాన్ని ప్రతి ఒక్క అడ్వొకేట్ పాటించాలి’’అని అన్నారు.