
హజరీబాగ్: జార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజరీబాగ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్ర నేత సహదేవ్ సోరెన్ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ తలపై రూ.కోటి రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మరో ఇద్దరు మావోయిస్టులు.. బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్రమ్ అలియాస్ చంచల్‌పై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు బీర్సెన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవాన్‌పై రూ.10 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, నిన్న (సెప్టెంబర్ 14) జార్ఖండ్‌లో మరో మావోయిస్టు మృతి చెందారు. పలాము జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
‘ఆపరేష్ కగార్’ మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు మావోయిస్ట్ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.