
ఎంచుకున్న పని మనుషుల సరఫరా
ఇంటి సేవల రంగం కొత్త పుంతలు
యాప్స్‌తో సేవలందిస్తున్న కంపెనీలు
దేశీయ మార్కెట్ విలువ రూ.42,500 కోట్లు
చాలా మంది గృహ యజమానులు ఇంటి రోజువారీ పని కోసం పనివారిని నియమించుకోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. తెలిసినవారైతేనే పనిలో పెట్టుకుంటాం. లేదా బంధువులు, స్నేహితులు సిఫార్సు చేయాల్సిందే. పల్లెలు, చిన్న పట్టణాల్లో పనివారు సులభంగా దొరుకుతారు. అదే నగరాలు ఇందుకు పూర్తి విరుద్ధం. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు ఆన్‌లైన్ వేదికలు పుట్టుకొచ్చాయి. 10 నిముషాల్లో పనివారిని గుమ్మం ముందుంచుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్‌్క
పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, మధ్యతరగతి కుటుంబాల సంఖ్య అధికం అవుతుండడంతో ఇంటి పనికోసం పనివారిని నియమించుకుంటున్నారు. పనివారి సరఫర కోసం ఎన్నో ఏళ్ల క్రితమే ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులను దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపిక చేసుకుని.. వీరిని నగరాల్లో పనిచేయడానికి నియమిస్తున్నాయి. వెబ్‌సైట్ లేదా ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ ఏజెన్సీలు సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ సేవల కోసం ఇప్పుడు యాప్స్ కూడా పోటీపడుతున్నాయి.
నిమిషాల్లో ఎంట్రీ..
స్నాబిట్, ప్రోంటో వంటి కొత్త స్టార్టప్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కేవలం 10 నిమిషాల్లో పని మనుషులను గుమ్మం ముందు ఉంచుతామని హామీ ఇస్తున్నాయి. అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టా హెల్ప్’పేరుతో 15 నిమిషాల్లోనే డొమెస్టిక్ హెల్పర్లను సరఫరా చేస్తోంది. ఇంటి అవసరాలను లక్ష్యంగా చేసుకుని ఈ స్టార్టప్స్ విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నాయి. బ్రూమీస్, బుక్‌మైబాయి కంపెనీలు సైతం క్విక్ సర్విస్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
విదేశాలకూ పనివారు..
చాలా ఇళ్లలో పనివారి అవసరం ఉంది. పనులు చేసే వారూ లక్షల్లోనే ఉన్నారు. అయితే ఈ ఇద్దరినీ కలిపే పూర్తి స్థాయి వ్యవస్థ లేకపోవడం మార్కెట్లో పెద్ద అంతరం. ఈ సమస్యకు పరిష్కారంగా అర్బన్ కంపెనీ, బుక్‌మైబాయి, బ్రూమీస్, మీహెల్ప్ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల గృహ అవసరాల కోసం పనివారిని సరఫరా చేసే స్థాయిలో ఈ కంపెనీలు అవతరించాయి. కంపెనీలు పనివారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం, ఐడెంటిటీ కార్డుల పరిశీలన, వ్యక్తిగత సంప్రదింపులు చేపడుతున్నాయి. అంతేగాక పనివారికి తగిన శిక్షణ ఇచ్చి నియమిస్తున్నాయి.
సంక్లిష్టమైన సవాళ్లు
భారత్‌లో హౌస్ కీపింగ్ మార్కెట్‌లో కార్యకలాపాల విస్తరణ కోసం స్టార్టప్‌లు కొన్నేళ్లుగా ప్రయతి్నస్తూనే ఉన్నాయి. కానీ అదే స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. పనివారికి డిమాండ్ ఉన్నప్పటికీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పనివాళ్లను, వినియోగదారులతో అనుసంధానించలేకపోతున్నాయి. వ్యక్తులతో ముడిపడి ఉండడంతో నమ్మకం, నియంత్రణ, నాణ్యత విషయంలో ఈ రంగంలో సవాళ్లు సంక్లిష్టంగా మారాయి. కస్టమర్ అసంతృప్తి అనేది ప్రధాన సమస్యగా అవతరించింది.
కస్టమర్ల నుంచి నెల జీతం కమీషన్‌గా వసూలు చేసే ఏజెన్సీలు చాలా కాలంగా పనిచేస్తున్నాయి. చాలా స్టార్టప్‌లు ఆ మోడల్‌ను డిజిటల్‌గా తయారు చేశాయి కానీ పెద్దగా ఆవిష్కరణలు జరగలేదు. భద్రత, నమ్మకం రెండు వైపులా కీలక సమస్యలుగా ఉన్నాయి. స్టార్టప్‌లు పనివారి ఐడెంటిటీ ధ్రువీకరణ, శిక్షణను అందిస్తున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ.. బలమైన ధ్రువీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం సంక్లిష్టం, ఖరీదైనదిగా మారిపోయాయి. నేపథ్య ధ్రువీకరణ విషయానికొస్తే చాలా కంపెనీలు ఇందుకోసం థర్డ్ పార్టీ సంస్థల సాయం తీసుకుంటున్నాయి.
ఎలా పనిచేస్తుందంటే..
ఈ డిజిటల్ ఆధారిత ప్లాట్‌ఫామ్స్‌లో కారి్మకులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వీరిని నియమించుకోవాలనుకునే వినియోగదారులకు కారి్మకుల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. పని, పని గంటలు, రోజులనుబట్టి కస్టమర్లు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు పనివారికి వాలెట్స్ రీచార్జ్ మోడల్ ద్వారా ఫీజును తీసుకుంటున్నాయి. అంటే హౌస్ కీపర్స్‌కు కంపెనీలు పని ఇప్పించినందుకుగాను కమీషన్‌రూపంలో కొంత మొత్తాన్ని వాలెట్ నుంచి తగ్గిస్తాయి. మరికొన్ని కంపెనీలు పనివారికి వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. యాప్స్ ద్వారా సేవలు అందించే కారి్మకులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని కంపెనీలు అంటున్నాయి.
⇒ భారతీయ హౌజ్ కీపింగ్ సేవల పరిశ్రమ పరిమాణం ప్రస్తుతం రూ.42,500 కోట్లుగా ఉంది. 2032 నాటికి ఈ మార్కెట్ రూ.1,70,000 కోట్లకు చేరుకుంటుందని జయాన్ మార్కెట్ రిసర్చ్ అంచనా వేస్తోంది.