సముద్ర గర్భంలో రైల్వే సొరంగం.. దేశంలోనే తొలిసారి!

India Will Get First Undersea Tunnel In Part Of High Speed Rail Project - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్‌ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్‌ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. 

గతంలో అండర్‌వాటర్‌ టన్నెల్‌ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి.

2019లోనే హైస్పీడ్‌ ట్రైన్‌ టన్నెల్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ టెండర్లు ఆహ్వానించింది. ఆ తర్వాత గత నవంబర్‌లోనూ మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి బిడ్లు దాఖలు చేయాలని గడువు విధించారు అధికారులు. ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్‌ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్‌ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది.

ఇదీ చదవండి: Viral Video: మేడ్‌ ఇన్‌ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top