
ప్రాచీన విజ్ఞానంపై విశ్వాసంతో దూసుకెళ్తున్న భారత్
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్ వ్యాఖ్య
ఇండోర్: భారతీయ సంప్రదాయక విజ్ఞానాన్ని నమ్ముకున్న భారత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. గత ఐదు త్రైమాసికాలతో పోలిస్తే ఈ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రతి ఒక్కరి అంచనాలు పటాపంచలు చేస్తూ భారత్ ఏకంగా 7.80 శాతం వృద్ధిరేటును సాధించిన నేపథ్యంలో భారత పురోభివృద్ధిని భాగవత్ ప్రస్తావించడం గమనార్హం.
ఆదివారం మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు చెందిన ‘పరిక్రమ కృపాసారం’పుస్తకాన్ని ఇండోర్‌లో ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో భాగవత్ మాట్లాడారు. ‘‘3,000 ఏళ్లపాటు భారత్ విశ్వశక్తిగా కొనసాగినన్నిరోజులు ప్రపంచంలో ఎలాంటి ఆధిపత్యపోరు, సంఘర్షణలు జరగలేదు. ఇప్పుడు ప్రపంచదేశాల్లో నెలకొన్న ఘర్షణలన్నీ స్వప్రయోజనాలకు సంబంధించినవే. ఇవే అన్ని సమస్యలకు మూలం. భారతీయుల పూర్వీకులు జ్ఞాన, కర్మ, భక్తి భావనలను ఎలా సమన్వయం చేసుకుని జీవించాలో మనకు బోధించారు.
ఈ సంప్రదాయక తత్వాన్ని భారత్ మనసావాచా కర్మణా పాటిస్తోంది. అందుకే ప్రతి ఒక్కరి అంచనాలను తప్పు అని ప్రకటిస్తూ ప్రగతిపథంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది’’అని అన్నారు. మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ చేసిన వ్యాఖ్యలను భాగవత్ ఉదహరిస్తూ.. ‘‘మేం(బ్రిటన్) మీకు (భారత్‌కు) స్వాతంత్య్రం ఇస్తే అంతర్గత వైషమ్యాలు, విబేధాలతో విడిపోతారు. కలిసి ఉండటం కల’అని వెక్కిరించారు. ఆయన అంచనాలు సైతం తప్పు అని భారత్ నిరూపించింది. ఐకమత్యాన్ని చాటింది. ఆర్థికాభివృద్ధితో పురోగమిస్తోంది.
విడిపోదామని బ్రిటన్‌లోనే కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ విభజన దిశలో అడుగులేస్తోంది. కానీ భారత్ విడిపోదు. మనం ముందుకే వెళతాం. గతంలో మనం విభజనకు గురయ్యాం ఇప్పుడు మళ్లీ ఆ ఐక్యతను సుసాధ్యంచేద్దాం’’అని అన్నారు. విశ్వాసాలు, నమ్మకాల మీదనే ప్రపంచం ముందుకుపోతోంది. అలాంటి నమ్మికలకు భారత్ పుట్టినిల్లు. ఇక్కడి వాళ్లంతా కర్మసిద్ధాంతాన్ని విశ్వసిస్తారు.
గోవులు, నదీమతల్లులు, వృక్షాలను పూజిస్తూ తద్వారా ప్రకృతి ఉపాసనను భారతీయులు ఆచరిస్తారు. అలా ప్రకృతిలో జీవిస్తారు. అలాంటి ప్రకృతి సంబంధం కోసం నేటి సమాజం అర్రులుచాస్తోంది. కానీ గత 300–350 సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా దేశాలు ఎవరి దారి వారిదే, బలవంతులే బతకాలి అనే తప్పుడు వాదనకు జైకొట్టాయి. దాంతో సమస్యలొస్తున్నాయని వాళ్లకు ఇప్పడు అర్థమైంది. జీవితనాటకంలో మనందరం పాత్రధారులం. నాటకం ముగిసినప్పుడే మనం ఎవరనేది మనకు బోధపడుతుంది’’అని ఆయన అన్నారు.