మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..

India To Host Miss World Pageant 2023 - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు భారత దేశం వేదికగా నిలవనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్గే ప్రకటన చేశారు.  

అప్పుడెప్పుడో 1996లో.. 
ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో హొయలొలికిస్తూ, తెలివితేటలను ఇనుమడింపజేస్తూ ఆయా దేశాల కీర్తి పతాకాలను రెపరెపలాడించే భిన్నమైన వేదిక. అయితే ఈసారి జరగబోయే పోటీలకు వేదికగా నిలవనుంది భారత దేశం. గతంలో 1996లో ప్రపంచ సుందరి పోటీలకు వేదికగ నిలిచిన భారత్ సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ పోటీలకు ఆతిధ్యమివ్వనుంది.  ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.  

ఇదే విషయాన్ని ఢిల్లీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి పోటీలను భారతదేశంలో నిర్వహించడం చాలా సంతోషకరం. నవంబర్ నెలలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన వేదికతో పాటు తేదీ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొతం 130 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. 

పోటీల్లో భాగంగా సుందరీమణులు ప్రతిభా పాటవాలు, సేవాతత్వ దృక్పధం, క్రీడా ప్రతిభ తోపాటు ఇతర అంశాల్లో కూడా రౌండ్లవారీగా పోటీ పడతారు. మిస్ వరల్డ్ గా ఎంపికయ్యే సుందరీమణి మార్పునకు రాయబారిగా వ్యవహరించనున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటినీ స్పృశించి ప్రపంచ సుందరిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జూలియా.

ఈ కార్యక్రమంలో 2022 ప్రపంచ సుందరి కరోలినా బియెలావ్ స్కా కూడా పాల్గొని.. నా చేతులతో నా వారసురాలికి  ఈ కిరీటం ధరింపజేయడానికి ఎదురుచూస్తున్నానని సాంప్రదాయానికి ప్రతిరూపమైన భారత్లో ఈ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు.  

ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని         

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top