IDBI Bank: ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌

IDBI Bank Recruitment 2021: Assistant Manager Jobs, Preparation Tips, Exam Date - Sakshi

ఐడీబీఐలో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ కొలువులు

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం

సెప్టెంబర్‌ 4వ తేదీన ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ

పీజీడీబీఎఫ్‌ కోర్సు ద్వారా శిక్షణ, నియామకం

డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ సాగిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 4వ తేదీన ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి.. నియామకం ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ విధానం గురించి తెలుసుకుందాం.. 

ఇండస్ట్రియల్‌ డెలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. మణిపాల్‌(బెంగళూరు), నిట్టే(గ్రేటర్‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా.. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఏడాది పాటు(9 నెలలు తరగతి బోధన, 3 నెలల ఇంటర్న్‌షిప్‌) శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పీజీడీబీఎఫ్‌ సర్టిఫికేట్‌తోపాటు ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఖాయం అవుతుంది. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 650. ఇందులో జనరల్‌–265, ఎస్సీ–97, ఎస్టీ–48, ఈడబ్ల్యూఎస్‌–65, ఓబీసీలకు–175 పోస్టులు కేటాయించారు. 


ఎంపిక ఇలా

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ ఆధారంగా కోర్సుకు ఎంపిక చేస్తారు.

200 మార్కులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌
► ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహలో 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే పర్సనల్‌ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. 

లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌
ఈ విభాగంలో నంబర్స్, కోడింగ్, డీ కోడింగ్, అనాలజీ, సిరీస్,డైరెక్షన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్‌టెస్ట్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు.

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌
ఇందులో వివిధ గణంకాలకు సంబంధించి అభ్యర్థుల మ్యాథమెటికల్‌ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఎదురవుతాయి. డేటా ఆధారంగా విశ్లేషణ చేసే సామర్థ్యం అభ్యర్థుల్లో ఉందో లేదో ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
అభ్యర్థులకు ఇంగ్లిష్‌ భాషపై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్లోజ్‌ టెస్ట్, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్స్, సెంటెన్స్‌ కరెక్షన్స్, జంబుల్డ్‌ సెంటెన్స్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రామర్, వొక్యాబులరీ, యాంటోనిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించడం ద్వారా మంచి మార్కులు స్కోర్‌ చేయొచ్చు. 

క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌
అభ్యర్థుల తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. ఇందులో సింప్లిఫికేషన్స్, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, నంబర్‌ సిరీస్, టైమ్‌ అండ్‌ వర్క్, డేటా సఫీషియన్సీ, మిక్చర్‌ అండ్‌ అలిగేషన్స్‌ వంటి వాటిపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
బ్యాంకింగ్, ఎకానమీ, ఆర్‌బీఐ–విధులు, జీడీపీ, జీఎన్‌పీ, ఎన్‌డీపీ/ఎన్‌ఎన్‌పీ, ఇతర ఆర్థిక, ఫైనాన్స్‌ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఎక్కువగా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గత 5 లేదా 6 నెలల కాలానికి సంబంధించిన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంస్థలు తీసుకున్న నిర్ణయాలు, ప్రముఖ వ్యక్తులు, రచనలు, క్రీడలు, ఒలింపిక్స్‌ సహా ఇతర ప్రాధాన్యత అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

► అభ్యర్థులు తాజా కరెంట్‌ అఫైర్స్‌తోపాటు 2021 కేంద్ర బడ్జెట్, 2020–21 ఆర్థిక సర్వేలను కూడా అధ్యయనం చేయాలి. 

ప్రిపరేషన్‌ ఇలా
► ఆన్‌లైన్‌ పరీక్షను సెప్టెంబర్‌ 4వ తేదీన నిర్వహించనున్నారు. అంటే.. పరీక్షకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ సమయంలో ఎక్కువగా ముఖ్యాంశాల రివిజన్‌పై దృష్టిపెట్టాలి. 

► బ్యాంకింగ్‌ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు ఇప్పటికే సిలబస్‌ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఇప్పుడు పరీక్ష తేదీకి అనుగుణంగా రివిజన్‌ కొనసాగిస్తే సరిపోతుంది. 

► ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా.. బ్యాంక్‌ పరీక్షల గత ప్రశ్న పత్రాలు, మోడల్‌ టెస్టులు, మాక్‌ టెస్ట్‌లను ప్రాక్టీస్‌ చేస్తుండాలి. 

ఎంపికైతే
► ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్‌) ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు ఫీజు మూడున్నర లక్షలు. అర్హత గల అభ్యర్థులు ఐడీబీఐ నుంచి రుణం కోసం ప్రయత్నించొచ్చు. కోర్సులో చేరేటప్పుడే అభ్యర్థులు మూడేళ్ల సర్వీస్‌ బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. 

► ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం(తొమ్మిది నెలలు)లో నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌ కాలం(మూడు నెలలు)లో నెలకు రూ.పది వేలు అందిస్తారు. 

► పీజీడీబీఎఫ్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఏ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి వేతన శ్రేణి రూ.36000–రూ.63840 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి.

► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  www.idbibank.in 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top