'నేను చ‌ద్దాను కాదు.. పార్టీ మార‌ను' | I am Saayoni Ghosh, not Raghav Chadha no question to Join BJP | Sakshi
Sakshi News home page

నేను చ‌ద్దాను కాదు.. పార్టీ మార‌ను: తృణమూల్ ఎంపీ

Apr 27 2026 7:29 PM | Updated on Apr 27 2026 9:22 PM

I am Saayoni Ghosh, not Raghav Chadha no question to Join BJP

ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌మ‌తా బెన‌ర్జీతో స‌యాని ఘోష్

కోల్‌క‌తా: త‌మ పార్టీ నాయ‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీని ప్ర‌ధాన‌మంత్రిగా చూడాల‌నుకుంటున్న‌ట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, న‌టి, గాయ‌కురాలు స‌యాని ఘోష్ అన్నారు.  2029లో దేశానికి మ‌మ‌త ప్ర‌ధాని అవుతారా అని మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు ఈ విధంగా జ‌వాబిచ్చారామె. ప‌శ్చిమ‌ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా ఓ టీవీ చాన‌ల్ రిపోర్ట‌ర్‌తో ఆమె ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌మ‌త ప్ర‌ధాని అయితే ముఖ్య‌మంత్రి కావాల‌న్న కోరిక ఉందా అని ప్ర‌శ్నించ‌గా.. అటువంటిదేమీ లేద‌ని స‌మాధానం ఇచ్చారు.

రాఘ‌వ్ చ‌ద్దా లాగా మీరు కూడా ఎప్పుడైనా సొంత పార్టీని వీడిని బీజేపీలో చేరే అవ‌కాశం ఉందా అని అడ‌గ్గా.. అలాంటి ప‌రిస్థితే ఉత్ప‌న్నం కాద‌న్నారు. ''నేను సయాని ఘోష్, రాఘవ్ చద్దాను కాదు. ఎప్ప‌టికీ సంఘ ప‌రివార్‌కు దూరంగానే ఉంటాన‌''ని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తూ ప్ర‌తిప‌క్ష‌ ఎంపీల‌ను బీజేపీ భ‌య‌పెడుతోంద‌ని ఆరోపించారు. బీజేపీ ద‌గ్గ‌ర వేల కోట్ల డ‌బ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. త‌మ‌కు అండ‌గా హ‌వాయి చెప్పులు, తెల్ల‌చీర ధ‌రించిన మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నార‌ని అన్నారు.

బెంగాల్ బీజేపీ నాయ‌కుడు సువేందు అధికారి బ్రిగేడ్ నేత అంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను సయాని ఘోష్ (Saayoni Ghosh) స‌మ‌ర్ధించుకున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీని ఉద్దేశించి ఆయ‌న దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఆ మాట‌లు వింటే బిగ్రేడ్ కాదు, సీగ్రేడ్ నాయ‌కుడంటార‌ని పేర్కొన్నారు. బెంగాల్ ప్ర‌జ‌లు మ‌ళ్లీ త‌మ పార్టీకే ప‌ట్టం క‌డ‌తార‌ని ఆమె విశ్వాసం వ్య‌క్తం చేశారు.

ప్ర‌చారంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌
జాద‌వ్‌పూర్ లోక్‌స‌భ స్థానానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సయాని ఘోష్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణమూల్ కాంగ్రెస్ త‌ర‌పున పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం సాగించారు. త‌న వాక్చాత్యురం, హావ‌భావాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఎక్క‌డికి వెళ్లినా త‌నదైన శైలిలో ఓట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమె ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. తృణమూల్ యూత్‌ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా కూడా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

చ‌ద‌వండి: కేజ్రీవాల్‌కు షాక్‌.. చ‌ద్దాకు జాక్‌పాట్‌? 

ముగిసిన ఎన్నిక‌ల ప్ర‌చారం
ప‌శ్చిమ బెంగాల్ రెండో ద‌శ ఎన్నిక‌ల‌కు ప్రచారం సోమ‌వారం సాయంత్రం ముగిసింది. ప్ర‌ధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నిక‌లు ప్ర‌చారం సాగించాయి. ఆయా పార్టీల అగ్ర‌నేత‌ల ప్ర‌చారంతో బెంగాల్ హోరెత్తింది. బీజేపీ త‌ర‌పున ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్నారు. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమె మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. 29న రెండో విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 4న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement