న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. ఆయన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటికీ, తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ప్రాణాలు కోల్పోయారు.
హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులతో అరుణ్ కుమార్ కుప్పకూలిపోగా, ఆయనతో ఉన్న షెర్పాలు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడి విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.
పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ ఈ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి మొదట రూ. 1.1 కోట్లు కోట్ చేయగా, ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు అవుతుందని తెలిపింది. 8,000 మీటర్ల ఎత్తులో, మంచులో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసి కిందకు తీసుకురావాలంటే దాదాపు 8 నుండి 10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హెలికాప్టర్ ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే నిధులు ఇస్తాయి తప్ప, ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ రికవరీలకు నిధులు కేటాయించవని సదరు సంస్థ స్పష్టం చేసింది.
ఈ పరిస్థితులు, భారీ ఖర్చు, ఇతరుల ప్రాణాలకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు.‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో భాగమయ్యారు’ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది కూడా చదవండి: మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు


