మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు | PM Modi Urges Nation to Stay Alert as Severe Heatwave Grips India | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు

May 27 2026 12:48 PM | Updated on May 27 2026 12:56 PM

PM Modi Urges Nation to Stay Alert as Severe Heatwave Grips India

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని దాటేస్తుండటంతో, వడగాల్పుల తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితికి దారితీసే ఈ ఎండల నుండి రక్షించుకునేందుకు అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు.

ఎండల వేళ పాటించాల్సిన నియమాలు
తీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని కోరారు. దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వాటర్‌బాటిల్‌ వెంట ఉంచుకోవాలని సూచించారు. తల తిరగడం, వాంతులు, తీవ్ర అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీడ ఉన్న చోటికి చేరాలని, వైద్య సహాయం పొందాలని సూచించారు.
 

మానవత్వంతో స్పందించండి
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని ప్రధాని కోరారు. దాహంతో ఉన్న వారికి మంచి నీరు అందించడం, నీరసంగా ఉన్నవారిని చల్లని ప్రదేశానికి తరలించి ఓఆర్‌ఎస్‌ వంటివి అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.

మూగజీవాలపై మానవత్వం
ఎండల తీవ్రత కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఇబ్బందికరమని ప్రధాని గుర్తు చేశారు. మన ఇళ్ల బాల్కనీలు, టెర్రస్‌లు, దుకాణాల ముందు ఒక చిన్న పాత్రలో నీటిని ఉంచడం ద్వారా దాహంతో ఉన్న పక్షులు, జంతువుల ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో మనలో ఉన్న కరుణే మూగజీవాలకు జీవనాధారమని, అందరూ ఈ మానవీయ బాధ్యతను నెరవేర్చాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement