'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' - పాపులర్ సినిమా డైలాగ్. ముందు 60 సీట్లు అన్నాడు, తర్వాత 30కి దిగాడు. చివరకు 15తోనే సరిపెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు బిహార్‌లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు ముకేష్ సహానీ. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు. మహాగఠ్‌బంధన్ (మహా కూటమి) ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం బిహార్ పాలిటిక్స్‌లో (Bihar Politics) హాట్‌టాపిక్‌గా మారారు. అంతగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సి ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది!
ముకేష్ సహానీ గురించి తెలుసుకోవాలంటే 2020 నాటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించుకోవాలి. మొదటి దశ ఎన్నికలకు వారం రోజుల ముందు మహాగఠ్‌బంధన్‌కు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేశారు. తాను అడిగిన 25 సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం దక్కకపోవడంతో బీజేపీ-జేడీయూ కూటమితో చేతులు కలిపాడు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 11 స్థానాలతోనే సరిపెట్టుకున్నాడు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తాను కోరుకున్న డిప్యూటీ సీఎం మాత్రం దక్కలేదు. ఆ ఎన్నికల్లో వీఐపీకి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి.
ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్
బీజేపీ సిఫారసు మేరకు సహానీని ఎమ్మెల్సీ చేసి పశుసంవర్ధక, మత్స్యకార మంత్రి పదవి కట్టబెట్టారు. అది కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. 16 నెలలకే మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించారు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున 53 మంది అభ్యర్థులను నిలబెట్టినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. అంతకు వారం ముందే వీఐపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహానీని కాదని బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒంటరి అయ్యారు. చివరకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా లాగేసుకున్నారు. ఇది జరిగి మూడున్నరేళ్లు అయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
15 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్సీ
ప్రస్తుత బిహార్ ఎన్నికల విషయానికి వస్తే ముకేష్ సహానీ.. మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నారు. సీట్ల విషయంలో గట్టిగానే పట్టుబట్టారు. ముందు 60 అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత 30కి తగ్గారని ఊహగానాలు వచ్చాయి. పాతిక సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం ఇస్తేనే ఉంటానని సహానీ కుండబద్దలు కొట్టారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో సహానీని ఆకర్షించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో వార్తలు షికారు చేశాయి. చివరకు 15 అసెంబ్లీ సీట్లు, రెండు శాసనమండలి స్థానాలతో పాటు రాజ్యసభ సీటుతో సర్దుకుపోయారు. కానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రాజీపడలేదు.
బలమైన ఓటు బ్యాంకు
ముకేష్ సహానీ విషయంలో అధికార, విపక్ష ఆసక్తి కనబరచడానికి ప్రధాన కారణం కులం. ఉత్తర బిహార్, లోతట్టు ప్రాంతాల్లో 20 ఉపకులాలతో కూడిన బోట్‌మెన్- ఫిషర్‌మెన్ కమ్యూనిటీ 'నిషాద్ కి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నిషాద్‌లో మల్లా, బింద్, బెల్దార్, కేవత్ వంటి ఉప కులాలు ఉన్నాయి. ముకేష్ సహానీ మల్లా సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రస్తుతం అతడి పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ప్రధాన పార్టీలు అతడికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఈ ఓటు బ్యాంక్. పట్నాకు ఉత్తరాన ఉన్న వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని ప్రాంతాలతో పాటు సీమాంచల్ వైపు తూర్పున కూడా కీలకమైన నిషాద్ కి ఓటు బ్యాంకు ఉంది.

2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీలో మహాకూటమి అభ్యర్థులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.03 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో బలమైన ఓట్లు బ్యాంకు కలిగిన ముకేష్ సహానీ తమతో పాటే ఉండాలని మహాకూటమి బలంగా కోరుకుంది. అందుకే అతడిని డిప్యూటీ సీఎం (Deputy CM) అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, తాము అధికారంలోకి మిగతా కులాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ప్రకటించడం గమనార్హం.
చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!
అందుకే ఒప్పుకున్నా
తమకు తక్కువ సీట్లు కేటాయించినా, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో మహాకూటమిలో ఉండేందుకు ఒప్పుకున్నారని ముకేష్ సహానీ తెలిపారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పేరు ప్రకటించినప్పడే సహానీ పేరు కూడా వెల్లడించారు. సన్ ఆఫ్ మల్లాగా పాపులర్ అయిన 44 ఏళ్ల సహానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. బాలీవుడ్‌లో సెట్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముకేష్ రాజకీయ రంగంలో ఎలా రాణిస్తారోనని బిహారీలు ఎదురు చూస్తున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి.


