
వక్ఫ్ అంటే సేవా కార్యక్రమం
ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025ను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే అయినప్పటికీ ఇస్లాంలో అది తప్పనిసరి భాగం కాదని తేల్చిచెప్పింది. వక్ఫ్ అంటే ఇస్లాంలో ఒక సేవా కార్యక్రమం అని స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ ధర్మానం ఎదుట వాదనలు వినిపించారు. సేవా కార్యక్రమాలను ప్రతి మతం గుర్తించి, ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఏ మతంలోనైనా ఇలాంటి సేవా కార్యక్రమాలను తప్పనిసరి భాగంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘వక్ఫ్ బై యూజర్’ సూత్రం ఆధారంగా ప్రభుత్వ ఆస్తులు, భూములపై ఎవరూ హక్కులు కోరలేరని అన్నారు. వక్ఫ్ బై యూజర్ నిబంధనను అడ్డం పెట్టుకొని వక్ఫ్ ఆస్తులను రాష్ట్రాలు బలవంతంగా లాక్కోలేవని చెప్పారు. దీనిపై ఆందోళన అవసరం లేదని వివరించారు.
వక్ఫ్ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు కాదని, ఇది శాసన వ్యవస్థ తీసుకొచ్చిన నిబంధన అని గుర్తుచేశారు. దాన్ని తొలగించే అధికారం కూడా శాసన వ్యవస్థకు ఉందన్నారు. ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు ఉండదని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వం కచ్చితంగా రక్షించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములతోపాటు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 14 కోట్ల మంది పౌరుల తరఫున వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వం సంరక్షకురాలిగా వ్యవహరిస్తోందని ఉద్ఘాటించారు.
వక్ఫ్(సవరణ) చట్టం ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ)తోపాటు స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారంటూ ఆందోళన చెందడం అర్థరహితమని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీలో మొత్తం 22 మంది సభ్యులను నియమించే అవకాశం ఉందని, అందులో ముస్లిమేతరులు గరిష్టంగా నలుగురు మాత్రమే ఉంటారని వెల్లడించారు. ఇక స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 11 మంది సభ్యులకు అవకాశం ఉండగా, అందులో ముస్లిమేతరులు ముగ్గురు మాత్రమేనని వివరించారు. ఎక్ఫ్–అఫీషియో సభ్యులు ముస్లిమేతరులు అయితే సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులకే స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. వక్ఫ్(సవరణ) చట్టంతో ముస్లిమేతరులు కూడా ప్రభావితం అవుతు న్నారు కాబట్టి వారిని సభ్యులు నియమించే నిబంధన తీసుకొచ్చినట్లు తెలియజేశారు. ఈ చట్టంపై వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి.