
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సాక్షి చావ్లా(37) తన భర్త దర్పణ్ చావ్లా, కొడుకు దక్ష్(11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తున్నారు. కుమారుడు పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడటంతో చికిత్స చేయిస్తున్నారు. కుమారుడి అనారోగ్యంపై చావ్లా తీవ్ర ఆందోళన పడేది.
ఈ క్రమంలో తన కుమారుడి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి తన కొడుకుతో కలిసి 13వ అంతస్తు ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన దర్పణ్ చావ్లా ఈ విషాద ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అతను మరొక గదిలో ఉన్న సమయంలో కేక వినిపించిందని, బాల్కనీకి చేరుకోగానే తన భార్య, కొడుకు కింద పడి ఉన్నారని ఆయన పోలీసులకు తెలిపారు. 'క్షమించండి' అంటూ భర్తకు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం.. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరుకోవడం లేదు. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అంటూ ఆమె సూసైడ్ నోట్‌లో రాసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.