సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ , కార్ పూలింగ్‌ను ఉపయోగించాలని కోరడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు , దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ కోరారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని పౌరులకు చేసిన విజ్ఞప్తి చేశారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నందున, ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ వైఖరి ఉండబోతోంది అంటున్నారు విశ్లేషకులు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
అమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన మధ్య ముడి చమురు ధరలు పెరగడంతో, చాలాకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు ఇక నాంది పలకవచ్చని అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.ఈ త్రైమాసికంలో రూ. 2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాలు నమోదవుతాయని అంచనా వేయడంతో OMC (చమురు కంపెనీ)లపై ఒత్తిడి పెరుగుతోందని, పౌరులకు మోదీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత మే 10న పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాశారు.ప్రతిరోజూ రిటైల్ స్టేషన్లకు వచ్చే 6 కోట్ల మందికి పైగా వినియోగదారులకు భారం పడకుండా చూసుకోగలిగామన్నారు.. అంతేకాకుండా, మోదీ ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో రూ. 14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో 69.01 డాలర్లుగా ఉన్న రిఫైనరీలు చమురును దిగుమతి చేసుకునే సగటు ధర, మే నెలలో 104.68 డాలర్లకు పెరిగిందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా వెల్లడించింది. చమురు సంస్థలు ఈ త్రైమాసికంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర అండర్-రికవరీలను (నష్టాలను) ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ధరలతో చమురు విక్రయాలు ఆర్థికంగా భారమని, కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్పనిసరి అని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు (స్ట్రాటజిక్ మరియు కమర్షియల్) ఉన్నాయి. డిమాండ్‌ను తగ్గించడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ఫిబ్రవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 69.01 డాలర్లు ఉండగా, మే నెల నాటికి అది 104.68 డాలర్లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది ఒకానొక దశలో 120 డాలర్లస్థాయిని కూడా దాటేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28 నుండి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు దిగుమతులు భారత్‌కు సవాలుగా మారిపోయింది.


