విజయ్‌ సతీమణి బీజేపీలోకి? | Gossip Of Day: Is TN CM Vijay Wife Sangeetha Join BJP | Sakshi
Sakshi News home page

విజయ్‌ సతీమణి బీజేపీలోకి?

May 30 2026 1:08 PM | Updated on May 30 2026 1:12 PM

Gossip Of Day: Is TN CM Vijay Wife Sangeetha Join BJP

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు విజయ్‌ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్‌ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.

ఆ తర్వాత సంగీత విజయ్‌ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.

ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. 

రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్‌ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్‌ వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్‌లోనే చదువుకున్నారు. విజయ్‌కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్‌ సంజయ్‌, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.

అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్‌ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్‌, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్‌ను బద్నాం  చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement