
న్యూఢిల్లీ: దేశంలో ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నూతన హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్) అని రాయడాన్ని పూర్తిగా నిషేధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ విధానాన్ని నిషేధిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.
ఫుడ్ ప్రొడక్ట్ బ్రాండ్ పేరులో, లేదా ట్రేడ్ మార్క్ లో ఓఆర్ఎస్ అనే పదాన్ని వినియోగించడం ఇకపై చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఈ నూతన నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. డీహైడ్రేషన్ నివారణ కోసం మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో పలు డ్రింకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటితో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న ఫార్ములాతో తయారైనదే అసలైన ఓఆర్ఎస్‌గా గుర్తించాలి.
అయితే మార్కెట్‌లో పలు రకాల ఆహార, పానీయాల తయారీ కంపెనీలు తమ పండ్ల రసాలు, పానీయాలకు ఓఆర్ఎస్ అనే పదాన్ని తగిలించి అమ్ముతున్నాయి. ఫలితంగా వినియోగదారులు సాధారణ డ్రింకులను కూడా వైద్యానికి వినియోగించే ఓఆర్ఎస్ అని భ్రమపడి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే
‘డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు’ అనే హెచ్చరికతో ఓఆర్ఎస్ పదాన్ని వాడేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతిచ్చింది.
ఈ విధంగా 2022 జూలై, 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా వినియోగదారులు వీటిని ఒరిజినల్ ఓఆర్ఎస్ అని భ్రమపడుతున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ నేపధ్యంలో పాత ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ఇకపై తప్పుదోవ పట్టించే లేబులింగ్‌తో విక్రయాలు జరపడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు ఈ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది.