
ఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన మాజీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్బంగా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం మాట్లాడటం సరైంది కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేయడం న్యాయ స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతాయి. కోర్టు తీర్పు స్పష్టంగా లేదా పరోక్షంగా నక్సలిజానికి మద్దతు ఇవ్వలేదని చెప్పింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవుల కోసం జరిగే ప్రచారాల సమయంలో, సైద్ధాంతిక చర్చలలో, రాజకీయ నాయకులు అవమానాలు చేయకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి అని కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై వారంతా సంతకాలు చేశారు.
BIG MONDAY MORNING DEVELOPMENT :
Seven former Supreme Court judges, three former High Court chief justices and eight former High Court judges issue a public statement criticising Home Minister Amit Shah for misinterpreting Supreme Court's 2011 Salwa Judum judgement and…— Nagendar Sharma (@sharmanagendar) August 25, 2025
న్యాయమూర్తుల బృందంలో ఉన్నది వీరే..
మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. కురియన్ జోసెఫ్, మదన్ బీ లోకూర్, జె.చలమేశ్వర్, ఏకే పట్నాయక్, అభయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్‌జిత్ సేన్ ఉన్నారు. మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.. గోవింద్ మాథుర్, ఎస్. మురళీధర్, సంజీబ్ బెనర్జీ ఉండగా.. సంజయ్ హెగ్డే, ప్రొఫెసర్ మోహన్ గోపాల్ వంటి ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారు.
అమిత్ షా విమర్శలకు స్పందన..
ఇక, అంతకుముందు.. సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్‌రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విభేదించారు. అనంతరం, ఆయన స్పందిస్తూ.. సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్‌లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని వ్యాఖ్యానించారు.
నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెలిసిందే.