
ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అంశం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ధన్‌ఖడ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అలాగే, రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించి.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని ప్రశ్నించారు.
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్‌ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అనంతరం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడుతూ.. రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నాం. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు.
#WATCH | On opposition raising questions about the resignation of former VP Jagdeep Dhankhar, Union HM Amit Shah says, "...'Baat ka batangad nahi banana chahiye' (don't make a fuss about it). Dhankhar ji was on a constitutional post and during his tenure, he did good work… pic.twitter.com/jJGRMogynf
— ANI (@ANI) August 25, 2025
ఇదే సమయంలో 130వ రాజ్యాంగ సవరణపై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా?. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ తమ పదవులకు రాజీనామా చేయాలి.
అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా మోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?. బిల్లు కచ్చితంగా పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుంది అని వ్యాఖ్యలు చేశారు.