
ఢిల్లీ: ఏపీలో కల్తీ మద్యం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ప్రతిపక్ష నేత మిథున్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడింది. ఈ కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. ఏపీలో ఆరు నెలల్లో అనేక కల్తీ మద్యం బాటిల్స్ డంప్ సీజ్ చేశారు.
నకిలీ ఐఎంఎఫ్ఎల్ లేబుల్స్, క్యాప్స్ తో ప్యాకింగ్ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో పంపిణీ చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల ద్వారా వ్యవస్థీకృత కల్తీ మద్యం నెట్వర్క్ నిర్వహిస్తున్నారని తేలింది. మిథనాల్, విషపూరిత రసాయనాలు ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్ తో మార్కెట్లో అమ్ముతున్నారు.
పేదలు వీటిని తాగి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇదొక వ్యవస్థీకృత నేరంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ను భారీ స్థాయిలో దారి మళ్లించి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ అంశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ,సిబిఐసి , ఎఫ్ఎస్ ఎస్ఎఐ దర్యాప్తు అవసరం.
ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్సీబీకి అప్పగించాలి. కల్తీ మద్యం రాకెట్‌ను ఛేదించాలి. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ దారి తప్పకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పట్టుబడిన భారీ లిక్కర్ డంపు అక్రమ మద్యం రాకెట్ లో చిన్న భాగం మాత్రమే. నకిలీ మద్యం పక్క రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ కల్తీ మద్యాన్ని నిరోధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాలి. ఈ నేపథ్యంలో ఈ కల్తీ మద్యం వ్యాపారం కేసుపై సిబిఐ దర్యాప్తు చేయించాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి’ అని లేఖలో కోరారు ఎంపీ మిథున్‌రెడ్డి.


