
హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న మూడు ఏహెచ్–64ఈ అటాక్ హెలికాప్టర్లు
భారత సైన్యంలోకి మోస్ట్ అడ్వాన్స్‌డ్ చాపర్లు
ఈ ఏడాది ఆఖరు నాటికి మరో మూడు హెలికాప్టర్ల రాక
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మైలురాయి లాంటి ఘట్టం చోటుచేసుకుంది. 15 నెలల నిరీక్షణకు తెరపడింది. అత్యాధునిక ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో అడుగుపెట్టాయి. మొదటి బ్యాచ్‌లో భాగంగా మూడు హెలికాప్టర్లను అమెరికా మిలటరీ సరుకు రవాణా విమానంలో మంగళవారం ఇండియాకు చేర్చారు. ఒప్పందం ప్రకారం 2024 మార్చి నెలలోనే రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో పలుమార్లు జాప్యం చోటుచేసుకుంది. ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది.
ఎడారిని భ్రమింపజేసే రంగులో ఉన్న ఈ చాపర్లను రాజస్తాన్‌లోని జైపూర్‌లో మోహరించబోతున్నారు. ఇవి ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ మలీ్టరోల్ కాంబాట్ హెలికాప్టర్లు. ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఒప్పందం ప్రకారం బోయింగ్ సంస్థ మొత్తం ఆరింటిని సరఫరా చేయాల్సి ఉండగా, మిగతా మూడు హెలికాప్టర్లను ఈ ఏడాది ఆఖరు కల్లా అందించనుంది. ఇప్పటికే 22 ఈ–మోడల్ అపాచీలను బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) అందజేసింది. ఏహెచ్–64ఈ అపాచీలను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. మొత్తం ఆరు హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం అమెరికా సర్కార్‌తోపాటు బోయింగ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.4,168 కోట్లు.
శత్రువులపై నిప్పుల వాన
అపాచీ హెలికాప్టర్ల రాక పట్ల భారత సైన్యం హర్షం వ్యక్తంచేసింది. వీటితో సైనిక దళాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రధానంగా భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలక సైనిక ఆపరేషన్ల కోసం ఏహెచ్–64ఈ అపాచీలను ఉపయోగించబోతున్నారు. ఉగ్రవాదుల కార్యకాలపాలను కట్టడి చేయడంతో కీలక పాత్ర పోషించబోతున్నాయి.
ముష్కరుల గుండెల్లో వణుకు పుట్టించడం తథ్యమని నిపుణులు అంటున్నారు. భూఉపరితలంతోపాటు ఆకాశంలో శత్రువుల ఉనికిని గుర్తించి, దాడి చేయడంలో అడ్వాన్స్‌డ్ టార్గెటింగ్ సిస్టమ్స్‌తో కూడిన ఈ హెలికాప్టర్లకు తిరుగులేదని చెబుతున్నారు. అమెరికా సైన్యంలో వీటి శక్తిసామర్థ్యాలు నిరూపితం కావడంతో కొనుగోలు చేసేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని బోయింగ్ సంస్థ తెలియజేసింది.
⇒ ఏహెచ్–64ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్లలో తుపాకులు, రాకెట్లు, క్షిపణుల వంటి బహుళ ఆయుధాలు అమర్చారు. 30 ఎంఎం ఎం230 చైన్ గన్, 70 ఎంఎం హైడ్రా రాకెట్లు ఇందులో అంతర్భాగమే. తక్కువ దూరం, ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడి చేయొచ్చు.
⇒ గంటకు 365 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 480 కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలవు. ఆటోమేటిక్ చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు పేల్చగలదు.
⇒ ఇక ఏజీఎం–114 హెల్‌ఫైర్ క్షిపణులతో భూమిపై ఆరు కిలోమీటర్ల దూరంలోని సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంక్‌లను సైతం ధ్వంసం చేయొచ్చు.
⇒ గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్ట్రింగర్ మిస్సైళ్లు మరో ప్రత్యేకత. గాలిలో ప్రయాణిస్తుండగానే శత్రుదేశాల హెలికాప్టర్లు, మానవ రహిత వాహనాలను కూల్చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అపాచీలు శత్రువులపై నిప్పుల వర్షం కురిపించి, తుత్తునియలు చేయగలవు.
⇒ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం మరో ప్రత్యేకత. పగలు, రాత్రి, వర్షంలో, దుమ్ములో, ధూళిలో, పొగలో... భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు దూసుకెళ్లి దాడి చేసేలా ఇందులో సెన్సార్లు, టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
⇒ సంక్లిష్టమైన యుద్ధ వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తాయి. దృఢమైన నిర్మాణం కావడంతో శత్రువుల దాడిని తట్టుకుంటాయి. చిన్నపాటి ఆయుధాలు ప్రయోగించినా ఏమాత్రం చెక్కుచెదిరే ప్రసక్తే ఉండదు. అపాచీలో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఒకరు పైలట్‌గా వ్యవహరిస్తారు. మరొకరు ఆయుధ వ్యవస్థను నియంత్రిస్తారు.
⇒ అపాచీ హెలికాప్టర్లు అమెరికా సైన్యంలో గత 40 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. 1980వ దశకం తర్వాత కీలకమైన ఆపరేషన్లలో పాల్గొన్నాయి. విశ్వసనీయత, ప్రభావశీలతను నిరూపించుకున్నాయి.