రిలయన్స్‌కు భారీగా దెబ్బ!
ఇకపై డిస్కౌంట్ క్రూడ్ దిగుమతులకు బ్రేక్ పడే అవకాశం
భారత్‌లోకి వస్తున్న రష్యా క్రూడ్‌లో సగం వాటా రిలయన్స్‌దే..
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజాలపై అమెరికా ఆంక్షల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారత్‌కు చౌకగా క్రూడ్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా లేరంటూ తాజాగా రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లూక్ ఆయిల్‌పై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల కొరఢా ఝులిపించారు.
దీంతో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకుంటున్న రష్యా డిస్కౌంట్ క్రూడ్‌కు అడ్డుకట్ట పడొచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్ నిర్వహిస్తోంది. భారత్‌కు రష్యా రోజుకు 1.7–1.8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఎగుమతి చేస్తుండగా.. ఇందులో దాదాపు సగం వాటా రిలయన్స్‌దే కావడం గమనార్హం.
జామ్‌నగర్ రిఫైనరీలో ఉత్పత్తి చేస్తున్న పెట్రోలియం ప్రొడక్టుల్లో అత్యధికంగా యూరప్, అమెరికాకు మార్కెట్ ధరతో విక్రయిస్తున్న రిలయన్స్... దీని ద్వారా భారీగా మార్జిన్లను ఆర్జిస్తోంది. అయితే, అమెరికా తాజా ఆంక్షలతో అమెరికన్ లేదా విదేశీ సంస్థలేవీ రష్యా సంస్థలతో వాణిజ్య లావాదేవీలు జరపకూడదు. ఉల్లంఘిస్తే, సివిల్ లేదా క్రిమినల్ జరిమానాలకు గురికావాల్సి వస్తుంది. అమెరికాతో పటిష్టమైన వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో రష్యా క్రూడ్ దిగుమతులను రిలయన్స్ గణనీయంగా తగ్గించుకోవడం లేదా పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
35 బిలియన్ డాలర్లు..
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రిలయన్స్ దాదాపు 35 బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ క్రూడ్‌ను డిస్కౌంట్ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ఉక్రెయిన్ వార్‌కు ముందు, అంటే 2021లో రిలయన్స్ రష్యా నుంచి కొనుగోలు చేసిన క్రూడ్ విలువ కేవలం 85 మిలియన్ డాలర్లు మాత్రమే కావడం విశేషం. 25 ఏళ్ల పాటు రోజుకు 5 లక్షల బ్యారెల్స్ వరకు ముడి చమురు దిగుమతి చేసుకునేలా (ఏడాదికి 25 మిలియన్ టన్నులు) రాస్‌నెఫ్ట్‌తో 2024లో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
అమెరికా రాస్‌నెఫ్ట్, లూక్‌ఆయిల్‌పై విధించిన ఆంక్షలతో నవంబర్ 21 లోపు ఆయా కంపెనీలతో రిలయన్స్ లావాదేవీలను నిలిపేయాల్సి ఉంటుంది. కాగా, ఈ పరిణామాలపై రిలయన్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోపక్క, తాజా ఆంక్షలతో నయారా ఎనర్జీకి కూడా మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. ఈ కంపెనీలో రాస్‌నెఫ్ట్‌కు 49.12 శాతం వాటా ఉంది. ఇది పూర్తిగా రష్యా క్రూడ్ దిగుమతులపైనే ఆధారపడి రిఫైనరీ, రిటైల్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జూలైలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన ఆంక్షలతో ఇప్పటికే నయారా ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ప్రభుత్వ రిఫైనరీలకు నో ప్రాబ్లమ్!
అమెరికా ఆంక్షల ప్రభావం ప్రభుత్వ రంగ రిఫైనింగ్ సంస్థలపై (ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇతరత్రా) ఉండకపోవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ప్రభుత్వ రిఫైనరీలు రాస్‌నెఫ్ట్, లూక్‌ఆయిల్ నుంచి నేరుగా క్రూడ్ దిగుమతి చేసుకోవడం లేదు. మధ్యవర్తి ట్రేడర్లు, ప్రధానంగా యూరోపియన్ ట్రేడర్ల (వారిపై ఆంక్షలు లేవు) నుంచి ముడి చమరు కొనుగోలు చేస్తుండటం వల్ల, ప్రస్తుతానికి దిగుమతులు యథాతథంగా కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నేరుగా రాస్‌నెఫ్ట్ ప్రమేయం లేకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందనేది వారి అభిప్రాయం.
రష్యా చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని, మోదీ ఈ మేరకు హామీనిచ్చారంటూ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇప్పటిదాకా అలాంటి ప్రకటనేదీ చేయలేదు. పైగా, రష్యా క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను కూడా ట్రంప్ విధించడం తెలిసిందే. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత రష్యా క్రూడ్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా అవతరించిన నేపథ్యంలో తాజా ఆంక్షలను భారత్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.


