
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి.
మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.
గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?
గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్‌సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.
ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్‌ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్‌తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది.
భారత్‌కు ఆకాశ్
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది.
ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు.