
సెక్యూరిటీ వివరాలను ఉప్పందిస్తారు
వివరాలు వెల్లడించిన ఉగ్రస్లీపర్ సెల్ మాజీ సభ్యుడు
శ్రీనగర్: పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కర్కశకాండ వెనుక స్థానిక స్లీపర్‌సెల్స్ హస్తం దాగుందని నిద్రాణంగా ఉండే ఉగ్ర బృందంలోని మాజీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఇలాంటి పలు విషయాలను పంచుకున్నాడు. ‘‘స్థానికంగా ఉండే వాళ్ల నుంచి కనీస సహకారం లేకుండా ఇంతటి దాడి చేయడం అసాధ్యం.
దాడిచేసిన లష్కర్ ఉగ్రవాదులతో కనీసం ఐదారుగురు స్థానిక స్లీపర్‌సెల్ సభ్యులు సాయపడి ఉంటారు. సాధారణంగా ఇలాంటి దాడుల్లో కనీసం నెల రోజుల ముందే స్లీపర్ సెల్ సభ్యులను దాడిచేయబోయే ఉగ్రవాదులు సంప్రదిస్తారు. దాడి ఎలా చేయాలి? ఎటు వైపు తప్పించుకోవాలి?లాంటివన్నీ ముందే ప్లాన్ చేస్తారు’’అని మాజీ స్లీపర్‌సెల్ సభ్యుడు చెప్పాడు.
‘‘ఒకవేళ నేనే స్వయంగా శ్రీనగర్‌లో దాడిచేయాలనుకుంటే గుడ్డిగా శ్రీనగర్‌కు వెళ్లను. ముందుగా శ్రీనగర్‌లో దాడిచేయబోయే చోట తరచూ ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు అనే ఖచ్చితమైన అంచనా ఉండాలి. ఆ ప్రాంతంపై నాకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన మనకు స్లీపర్‌సెల్స్ సభ్యులు కల్పిస్తారు. భద్రతా బలగాలు ఎంత మంది ఉండొచ్చు, దాడికి సఫలమయ్యే అవకాశాలు లాంటివన్నీ వాళ్లే చెప్తారు. తర్వాత ఉగ్రవాదులు రంగంలోకి దిగుతారు. బైసారన్‌లోనూ ఇదే జరిగి ఉంటుంది’’అని అన్నాడు.
గతంలో జైలుకు వెళ్లి..
ఇతను గతంలో స్లీపర్‌సెల్‌లో పనిచేసిన నేరానికి కొన్నేళ్లు జైలులో గడిపి బయటికొచ్చాడు. ‘‘స్లీపర్‌సెల్ సభ్యులు దాడి చేయరు. దాడి చేయబోయే ఉగ్రవాదులకు ఆర్మీ కదలికలపై నిఘా సమాచారం అందిస్తారు. ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అత్యయిక అవసరాలు తీరుస్తారు. నేను కూడా గతంలో 2–4 ఏళ్లు స్లీపర్‌సెల్ సభ్యునిగా పనిచేశా. ఉగ్రవాదులకు కావాల్సినవి అందించా. రాత్రిళ్లు తిరిగి సమాచారం సంపాదించి ఇచ్చా. నేను ఇచ్చిన సమాచారంతో వాళ్లు ఎన్నో దాడులు చేశారు’’అని చెప్పాడు. గ్రనేడ్ దాడి ప్రయత్నంలో భద్రతా బలగాలు ఇతడిని అరెస్ట్‌చేశారు.
నేరం నిరూపణ అయ్యాక కొంతకాలం జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ‘‘ఆనాడు నేను మైనర్‌గా ఉండబట్టే విడుదలయ్యా. అది నా అదృష్టం. లేదంటే ఎప్పటికీ నేను విడుదలకాకపోయే వాడినేమో’’అని అతను అన్నాడు. ‘‘2015 కాలంలో నన్ను ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకున్నారు. అప్పట్లో ఫేస్‌బుక్, వాట్సాప్ యాప్‌లపై నిఘా అంతగా లేదు. అందుకే ఫేస్‌బుక్‌లో నాకు మెసేజ్‌లు పంపేవాడు. కొంతకాలానికి నిఘా పెరగడంతో బీబీఎం యాప్‌కు మారా. ఈ యాప్‌లో చేసే వీడియో, వాయిస్ కాల్స్‌ను ఎవరూ కనిపెట్టలేరు’’అని అతను చెప్పాడు.
ఉగ్రవాదులతో పనిచేయడం 110 శాతం తప్పు
‘‘స్లీపర్‌సెల్ సభ్యునిగా ఉంటూ చిట్టడవిలోకి వెళ్లి ఉగ్రవాదులకు ఆహారం అందించి రావడం నా తొలి పని. తర్వాతర్వాత ఒక చోట ఉన్న వస్తువును రహస్యంగా మరో చోటుకు చేర్చాల్సి వచ్చేది. నాకు ఈ పనులు పురమాయించే ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే నేను నమ్మకస్తుడినా కాదా అని నిర్ధారించుకునేందుకు నాపై కూడా నిఘా కొనసాగేది. ఇప్పుటికీ నా స్నేహితుల్లో ఇద్దరు ఉగ్రవాదులుగా కొనసాగుతున్నారు. మరో 13–14 మంది స్నేహితులు ఉగ్రవాదులుగా మారి భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లలో చనిపోయారు. ఏ విధంగా చూసినా ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం 110 శాతం తప్పు. నా పదేళ్లగతాన్ని చూసుకుంటే అసలు నేనింకా బతికే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది’’అని అతను చెప్పాడు.