ఆయన చేతిలో తోలుబొమ్మ  | Election Commission has become PM Modi puppet | Sakshi
Sakshi News home page

ఆయన చేతిలో తోలుబొమ్మ 

Aug 3 2025 5:37 AM | Updated on Aug 3 2025 5:37 AM

Election Commission has become PM Modi puppet

ఈసీని నరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారు 

రాజ్యసభలో ధన్‌ఖడ్‌నూ ప్రభుత్వం వాడుకుంది 

కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే విమర్శ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. బిహార్‌లో బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటర్ల జాబితాను మార్చేందుకు ప్రధాని మోదీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని దురి్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు’’సదస్సులో ప్రసంగిస్తూ ‘‘భారతరాజ్యాంగం అనేది కేవలం చట్టపరమైన పత్రం కాదు. అది మన ప్రజాస్వామ్య ఆత్మ. ప్రతి భారతీయుడికి రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రసాదించింది. అలాంటి రాజ్యాంగం ఇప్పుడు మోదీ సర్కార్‌ ఏలుబడిలో ప్రమాదంలో పడింది.

 రాజ్యాంగంలో సవరణలు చేయాలన్న దుస్సాహసానాకి నేటి పాలకులు తెగిస్తున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో బీజేపీ పెను మార్పులు చేసేది. కానీ ప్రజాశీస్సులు లేని ఎన్‌డీఏ కూటమికి అన్ని సీట్లు రాలేదు. ఓటర్లు 400సీట్లు అని పాటపాడి వారి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘనత అంతా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాందీకే దక్కుతుంది. రాజ్యాంగంలో మార్పులు చేస్తామన్న ఎన్‌డీఏ సర్కార్‌కు ఎదురునిలిచి నెలలతరబడి పోరాటంచేశారు. ప్రతి సమావేశంలో రాజ్యంగ ప్రతిని చేతబూని రాజ్యాంగ గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేశారు’’అని ఖర్గే అన్నారు.  

ఏకంగా 65 లక్షల ఓట్లు ఎలా తీసేస్తారు? 
‘‘బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) వేళ 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు దరఖాస్తును మరోసారి సమర్పించంత మాత్రాన అంత మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి ఈసీ ఎలా తొలగిస్తుంది?. పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ఈ ఓటర్ల ఓటు హక్కులను ఈసీ ఉద్దేశపూర్వకంగా లాగేసుకుంటోంది. బీజేపీ పాలనతో విసిగిపోయిన కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్న ఓటర్ల ఓట్లను తొలగించాలన్న కుట్ర జరుగుతోంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో ‘మార్పులు’జరుగుతున్నాయి.

 కర్ణాటక ఎన్నికల వేళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు జరిగాయనేదానిపై ఇప్పుడు కాంగ్రెస్‌ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఒక్క గదిలో 9 ఓట్లు, ఒకే హాస్టల్‌లో 9,000 ఓట్లు ఎలా ఉంటాయి? ఇలాంటి అక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘమా? లేదంటే మోదీ చేతిలో కీలుబొమ్మనా?’’అని ఖర్గే ప్రశ్నించారు. 

‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులను వివక్షకు గురిచేయడం నిత్యకృత్యమైంది. ఎన్నికల వేళ కేవలం ఒక పక్షానికి అనుకూలంగా ప్రధాని ప్రకటనలు చేస్తూ భారత్‌లో ఏకధృవ సమాజాన్ని సృష్టించాలని ఆయన ఆశపడుతున్నారు. తరచూ చికెన్, మొఘలులు, మంగళసూత్రం అంశాలపై మోదీ మాట్లాడుతూ సమాజంలో విభజన తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడనే ఆయనను ప్రజలు ఎన్నుకుంటే ఆయనను ఏకంగా రాజ్యాంగ విలువలనే కాలరాస్తున్నారు’’అని ఖర్గే ఆరోపించారు.  

మోదీకి చురక 
‘‘పార్లమెంట్‌ సమావేశాల వేళ ప్రధాని మోదీ పార్లమెంట్‌ ప్రాంగణానికి వచ్చి ఆయన ఆఫీస్‌లోనే కూర్చుంటారు. టీవీలో రాజ్యసభ, లోక్‌సభ చర్చలు, సభా కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారాలు చూస్తారు. పార్లమెంట్‌ ప్రోసీడింగ్స్‌ తెలియాలంటే అలా టీవీలో చూడకుండా నేరుగా సభలోకి వచ్చి కూర్చోవాలి. అప్పుడు ప్రత్యక్ష అనుభవం కల్గుతుంది’’అని మోదీకి ఖర్గే చురక అంటించారు. 

రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్‌నూ.. 
‘‘రాజ్యసభలో నాటి డెప్యూటీ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌నూ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. రాజ్యసభలో వి పక్షాల గొంతు నొక్కేందుకు ధన్‌ఖడ్‌నూ ఓ పా వులా వాడుకున్నారు. విపక్ష నేతలకు ధన్‌ఖడ్‌ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆయన సభా కార్యకలాపాలను పర్యవేక్షించినప్పుడు పెద్దసంఖ్యలో విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్‌ చేశారు. చిట్టచివర్లో ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుందామని భావించినా ఆయనపై ప్రభుత్వ పెద్దలు మరింత ఒత్తిడి పెంచారు’’అని ఖర్గే వ్యాఖ్యానించారు.

సామ్యవాదం, లౌకికవాదంను తొలగించాలనుకున్నారు 
‘‘రాజ్యాంగ పీఠికలో దశాబ్దాల క్రితం చేర్చిన సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించాలని బీజేపీ ప్రభుత్వం నిశ్చయంగా ఉందిన ఆ పార్టీ కీలక నేతలే సెలవిస్తున్నారు. రాజ్యాంగం నుంచి ఈ పదాలను తీసేయాలని చూస్తున్న ఇదే పార్టీ తమ సొంత పార్టీ సిద్ధాంతాలు, నియమనిబంధనల్లో మాత్రం సామ్యవాదం, లౌకికవాదం పదాలను కొనసాగించడం విడ్డూరం. ఆ పదాలను బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు తొలగించలేవు. ఎందుకంటే అంతటి శక్తిని వాళ్లకు ప్రజలు కట్టబెట్టలేదు’’అని ఖర్గే అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడే పవిత్రబాధ్యతలు రాజ్యాంగం న్యాయవ్యవస్థ, ఎలక్షన్‌ కమిషిన్, మీడియాకూ ఇచ్చింది. కానీ ఒక మతాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్జీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎంపిక క్రతువు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం కంటే నియంతృత్వం ఉందనడం నయం’’అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement