
పదేళ్లుగా కాపాడుతోంది: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల దొంగలను స్వయానా కేంద్ర ఎన్నికల సంఘమే కాపాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఓటు చోరులను కాపాడే బ్యాక్ ఆఫీస్‌లాగా ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సంస్థ ఓట్ల దొంగలకు రక్షణ కవచంలా మారిందని నిప్పులు చెరిగారు.
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గ ఓటర్ ఫ్రాడ్ కేసులో ఈసీ వైఖరిని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఖర్గే పోస్టు చేశారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓటర్ ఫ్రాడ్ కేసులో ఎన్నికల సంఘం వైఖరిని ఆయన తప్పుపట్టారు. కీలకమైన ఆధారాలను దాచిపెట్టారని విమర్శించారు. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓటర్ల పేర్లు తొలగించేందుకు నకిలీ ఫామ్–7 దరఖాస్తులు వాడినట్లు కాంగ్రెస్ బహిర్గతం చేసింది.
దీనిపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో 5,994 నకిలీ అప్లికేషన్లు బయటపడ్డాయి. ఇది చిన్న తప్పిదం కాదని, ఓటు హక్కును దోచుకోవడానికి పన్నిన పెద్ద కుట్ర అని ఖర్గే ధ్వజమెత్తారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచి్చంది. తొలుత ఎన్నికల సంఘం కొన్ని పత్రాలు సమరి్పంచినప్పటికీ ఇప్పుడు మాత్రం కీలక ఆధారాలను ఇవ్వకుండా వెనక్కి తగ్గిందని ఖర్గే ఆరోపించారు.
‘‘ఈసీ ఎందుకు వెనక్కి తగ్గింది? నకిలీ వోటర్ల వెనుక ఉన్న వారిని కాపాడేందుకేనా?’’ అని నిలదీశారు. బీజేపీ ఓటు చోరీ డిపార్టుమెంట్ అంటూ ఈసీని అభివర్ణించారు. సీఐడీ దర్యాప్తును నీరుగార్చడానికి బీజేపీ ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందన్నారు. ఓటు హక్కు అంటే ప్రజాస్వామ్యానికి మూలం అని స్పష్టం చేశారు. ఆ హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ఓట్ల దొంగలతో చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన సంస్థే బలహీనపరుస్తోందని ఆక్షేపించారు.
దేశానికి శత్రువు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి శత్రువుగా మారారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ మంచి స్నేహితులే అయినప్పటికీ ఆ స్నేహం వల్ల భారత్‌కు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. ఆదివారం కర్ణాటకలోని కలబుర్గిలో ఖర్గే మీడియాతో మాట్లాడారు. భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లను ప్రస్తావించారు. దీనివల్ల మన ప్రజలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. ట్రంప్‌తో స్నేహం సంగతి పక్కనపెట్టి దేశ ప్రయోజనాలను కాపాడే విషయం ఆలోచించాలని మోదీకి హితవు పలికారు. దేశమే ప్రథమం, ఆ తర్వాతే స్నేహం అని తేలి్చచెప్పారు. జీఎస్టీలో సంస్కరణలతో నిజంగా పేదలకు మేలు జరిగితే స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.
నేడు విపక్ష ఎంపీలకు ఖర్గే విందు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు. పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలకు మల్లికార్జున ఖర్గే సోమవారం రాత్రి విందు ఇవ్వబోతున్నారు.