ఇక దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌!  | EC may conduct nationwide SIR of electoral rolls by 2025 | Sakshi
Sakshi News home page

ఇక దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌! 

Sep 11 2025 5:37 AM | Updated on Sep 11 2025 5:37 AM

EC may conduct nationwide SIR of electoral rolls by 2025

అక్టోబర్‌ నుంచే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  

అన్ని రాష్ట్రాల చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ  

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అక్టోబర్‌ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులతో(సీఈఓ) కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వర్క్‌షాప్‌ నిర్వహించారు. 

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఈ భేటీలో ఆమోదముద్ర వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని, అనర్హుల పేర్లు చేరుస్తున్నారని మండిపడుతున్నాయి. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ఎస్‌ఐఆర్‌ పేరిట కుట్రలు సాగిస్తున్నారని బీజేపీ కూటమిపై ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. విపక్షాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌కు సిద్ధమవుతుండడం గమనార్హం.  

ధ్రువపత్రాల జాబితా సిద్ధం చేయండి 
బిహార్‌ ఎన్నికలు ముగియకముందే దేశమంతటా ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో సీఈఓల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం సేకరించింది. ఎస్‌ఐఆర్‌కు ఎప్పటిలోగా సిద్ధం కాగలరని ప్రశ్నించగా.. సెపె్టంబర్‌లో ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పూర్తిచేస్తామని, అక్టోబర్‌ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించగలమని చాలామంది సీఈఓలు బదులిచ్చారు. 

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వనరులు, సన్నాహాలపై మూడున్నర గంటలపాటు ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఓటర్ల అర్హతను తేల్చడానికి అవసరమైన ధ్రువపత్రాల జాబితాను సిద్ధం చేయాలని సీఈఓలను ఆదేశించారు. స్థానికంగా ఆమోదించే, సులభంగా లభించే ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.  

స్పష్టమైన సమగ్ర ఓటర్ల జాబితా కోసమే..  
ఎస్‌ఐఆర్‌ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే తేల్చిచెప్పింది. పారదర్శకమైన, అత్యంత కచి్చతత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించడమే అసలు లక్ష్యమని వెల్లడించింది. మరణించివారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి పేర్లను, డూప్లికేట్‌ ఎంట్రీలను, దేశ పౌరులను కానివారి పేర్లను తొలగించడానికే ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొంది. 

ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేర్లను ఇందులో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సమగ్రమైన, స్పష్టమైన ఓటర్ల జాబితాను రూపొందించాలంటే ఎస్‌ఐఆర్‌ తప్పనిసరి అని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సవరించిన ఓటర్ల జాబితాలతోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement