రాష్ట్రపతిగారూ మైసూరు  దసరాకు రారండి!

Draupadi Murmu Invited Inauguration Of Mysore Dussehra Celebrations - Sakshi

మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దసరా మహోత్సవ సమితి ఆహ్వానం పలికింది. గురువారం ఇన్‌చార్జ్‌ మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్, ఎంపీ ప్రతాపసింహ, మంత్రి శశికళ జొల్లె తదితరులు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రథమ పౌరురాలిని ఆహ్వానించారు.

ఈ నెల 26వ తేదీన ఉదయం 9.45 గంటల నుంచి 10.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో చాముండిబెట్ట పైన ఉన్న చాముండేశ్వరి దేవి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా ఉత్సవాలకు నాంది పలుకుతారు. కాగా దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనుండడం ఇదే మొదటిసారి. సాధారణంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా సంబరాలకు శ్రీకారం చుట్టేవారు.  

వారంపాటు సాంస్కృతిక ప్రదర్శనలు 
అంబా విలాస్‌ ప్యాలెస్‌ ఆవరణలో బృహత్‌ వేదికపై సెప్టెంబర్‌ 26వ తేది నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు వారంపాటు వైభవంగా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో స్థానిక,  జాతీయ, అంతర్జాతీయ స్థాయి నృత్య, గాన తదితర రంగాల కళాకారులు పాల్గొని ఆహూతులను అలరిస్తారు. 26న సీఎం బొమ్మై ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు.  

ఫల పుష్ప ప్రదర్శన 
మైసూరు వర్సిటీ ఉద్యాన వన విభాగం ఆధ్వర్యంలో  26 నుంచి ఫల పుష్ప ప్రదర్శన కనువిందు చేయబోతోంది. నగరంలోని కుక్కరహళ్లి చెరువు వద్ద ఏర్పాటవుతుంది.  రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. దీనికి తోడు ప్యాలెస్‌ ఆవరణలోనూ ఫల పుష్ప అలంకరణ నిర్వహిస్తారు.  

త్వరలో 3 స్పెషల్‌ రైళ్లు 
మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే యాత్రికుల కోసం రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది.  సెపె్టంబరు 30వ తేదీన చామరాజనగరకు రాకపోకలు సాగించే రైలు సర్వీసు ఆరంభమవుతుంది. అలాగే అక్టోబరు 5వ తేదీన బెంగళూరుకు రెండు రైలు సర్వీసులను ఆరంభిస్తారు. కాగా, చాముండి కొండ పైన ఉన్న మహిష విగ్రహం వద్ద సెపె్టంబర్‌ 25వ తేదీన మహిష దసరాను నిర్వహిస్తామని మాజీ మేయర్‌ పురుషోత్తం తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈసారి ఎవరు అడ్డుకున్నా జరిపి తీరుతామని అన్నారు.  

(చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్‌ వాదనపై సుప్రీం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top