
డీకే శివకుమార్ (DK Shivakumar) వరుస ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతూనే వస్తోంది. గతకొంతకాలంగా ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెబుతున్నా.. తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్ అంటున్నా అక్కడి రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే..
తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. ఇండియా టుడే కంక్లేవ్ సౌత్ 2025లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..
సీఎం పదవి నిర్ణయం పార్టీ హైకమాండ్‌దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు. నేను.. నా నాయకత్వం, నేను.. నా పార్టీ, నేను .. సిద్ధరామయ్య. ఎవరైనా.. ఏ విషయంలో అయినా మా పార్టీ హైకమాండ్‌దే సంపూర్ణ అధికారం. వారు చెప్పినదానికే మేం కట్టుబడి ఉంటాం. మేము కర్ణాటక ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని హామీ ఇచ్చాం. అదే మా ముఖ్య లక్ష్యం. అందుకోసం అందరం కలసి పని చేస్తాం అని అన్నారాయన.
కాంగ్రెస్ ప్రభుత్వ బలం.. ఏ శివకుమార్ మీదో, సిద్ధారమయ్య మీదో, మరెవరి మీదో ఆధారపడి ఉండదు. అది ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. అది నిరంతర సమిష్టి విజయం. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ ఐక్యతే మాకు బలం అని అన్నారాయన.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. అంటే, ఇప్పటివరకు సరిగ్గా 1 సంవత్సరం 3 నెలలు (2025 సెప్టెంబర్ 9 నాటికి) పూర్తయ్యాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు.
ఈ ప్రచారాన్ని సిద్ధరామయ్య మొదటి నుంచి తోసిపుచ్చుతున్నారు. అయితే తాను ముఖ్యమంత్రిని (Karnataka CM) కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదంటున్న డీకే శివకుమార్.. అందుకు పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉండాలంటున్నారు.