కార్పొరేటర్ల టికెట్లకు కాంగ్రెస్ దరఖాస్తులు
శివాజీనగర: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం తీవ్రంగా పోరాడుతున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఓట్ చోరీ ఆందోళన అవకాశమిచ్చింది. ఢిల్లీలో ఆదివారం ఈ ధర్నాలో సీఎం సిద్దరామయ్య, డీకే తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సిద్దరామయ్య ఆదివారమే బెంగళూరుకు తిరిగివచ్చారు. అయితే శివకుమార్ హస్తినలోనే మకాం వేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళాల కేసులో ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉండడమే కారణం. అదే సమయంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిసి చర్చలు జరిపారు. తన భేటీల సారాన్ని డీకే వెల్లడించలేదు. అయితే కుర్చీ మార్పిడి వ్యవహారంలో త్వరగా ఒక నిర్ణయం తీసుకుని సందిగ్ధానికి ముగింపు పలకాలని విన్నవించినట్లు సమాచారం.
అందరితో మాట్లాడాను: డీకే
ఢిల్లీలో డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా అందరినీ కలిశాను, ఢిల్లీకి వస్తే హైకమాండ్‌ను కలవాలి కదా అన్నారు. హైకమాండ్ నేతలతో ఎప్పుడూ భేటీలు ఉంటాయి, మీరేమీ భయపడకండి అని విలేకరులతో చమత్కరించారు. మరికొన్ని ముఖ్యమైన సమావేశాలు జరగాల్సి ఉండగా, దావణగెరెలో ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మృతితో అంతరాయం కలిగింది. మల్లికార్జున ఖర్గే కలసి డీకే దావణగెరెకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. సోమవారం ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరు కాలేకపోవడంతో మరో గడువును కోరతానని డీకే తెలిపారు. తనకు ఇచ్చిన నోటీస్‌లో ఎఫ్‌ఐఆర్ కాపీనే పంపలేదని తెలిపారు.
త్వరలో పరిష్కార ఫార్ములా
రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన సీటు రగడకు హైకమాండ్ త్వరలోనే ఔషధం ఇవ్వనుందని ప్రచారం సాగుతోంది. ఆదివారం ఢిల్లీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలను కలిశారు. కుర్చీ గొడవల వల్ల పార్టీకి, ప్రభుత్వ గౌరవానికి భంగం కలుగుతోంది. త్వరగా ఓ పరిష్కారం రూపొందించాలని విన్నవించగా, ఇందుకు సానుకూలంగా స్పందన వచ్చిందని తెలిసింది. ఢిల్లీలో పార్లమెంటు, బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం, డీసీఎంలను ఢిల్లీకి పిలిపించుకొని ఫార్ములాను రూపొందించనున్నారు. అందరూ కొంచెం ఓర్పుతో ఉండాలని, అన్నింటినీ పరిష్కరిస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం, డీసీఎంతో హైకమాండ్ భేటీ!
హామీ ఇచ్చిన పార్టీ పెద్దలు
ఢిల్లీ పర్యటనలో కొత్త పరిణామాలు
హస్తినలో డీకే శివ వరుస మంతనాలు
శివాజీనగర: గ్రేటర్ బెంగళూరులో 5 పాలికెల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల నుంచి వార్డు కార్పొరేటర్ల టికెట్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. 369 వార్డుల్లో పోటీ చేసేందుకు ఎవరెవరికి ఆసక్తి ఉందని తెలుసుకోవటానికి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. దరఖాస్తుల విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును పార్టీ భవన నిధికి జమ చేస్తారు. దరఖాస్తుకు జనరల్ ఆశావహులు రూ. 50 వేలు, మహిళలు, ఎస్సీ సముదాయం వారికి రూ.25 వేలు చెల్లించాలని తెలిపారు. కాగా, ఇంత రేటా.. అని దరఖాస్తుల ధరను చూసి నాయకులే ఆశ్చర్యపోతున్నారు.
కార్పొరేటర్ల టికెట్లకు కాంగ్రెస్ దరఖాస్తులు
కార్పొరేటర్ల టికెట్లకు కాంగ్రెస్ దరఖాస్తులు


