ప్రభుత్వ లాంఛనాలతో శామనూరుకు వీడ్కోలు
సాక్షి బళ్లారి: దేశంలోనే అత్యంత పెద్ద వయస్సు కలిగిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అఖిల భారత వీరశైవ మహాసభ జాతీయ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్ప(94) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన వయోభారం, సహజమైన ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులకు చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి లోక్‌సభ సభ్యుడుగా, మంత్రిగా, పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన శామనూరు మృతితో దావణగెరె ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వీరశైవ లింగాయత్ సమాజ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఉదయం నుంచి కుమారుడు మల్లికార్జున నివాసంలో పార్థీవ శరీరాన్ని ఉంచి అక్కడ నుంచి పలువురు మఠాధీశులు, రాజకీయ ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరారు.
వీరశైవ విధివిధానాలతో అంత్యక్రియలు
చివరి సారిగా శామనూరు పార్థివ దేహాన్ని దర్శించుకొన్న అనంతరం హైస్కూల్ మైదానంలో ఉంచిన తర్వాత వేలాది మంది సమక్షంలో శామనూరు భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి కల్లేశ్వర రైస్ మిల్లు ఆవరణలో సంప్రదాయబద్ధంగా వీరశైవ విధివిధానాలతో పూజలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. శామనూరు శివశంకరప్ప తండ్రి, తల్లి, సోదరులు, ధర్మపత్ని పార్వతమ్మల సమాథుల పక్కనే శివశంకరప్పను సమాధి చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తదితరులతో పాటు పలువురు మఠాధీశులు, పంచపీఠాలు, విరక్త మఠాల స్వామీజీలు పాల్గొని శ్రద్ధాంజలి అర్పించి సంతాపం ప్రకటించారు. తుమకూరు సిద్ధగంగ మఠం నుంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీసుకువచ్చిన విభూతిని అంత్యక్రియలకు ఉపయోగించారు.
అశ్రునయనాలతో శివశంకరప్ప
అంతిమయాత్ర
శోకసముద్రంలో దావణగెరె జిల్లా ప్రజలు
ఆయన జీవిత కాలంలో చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజాభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. దావణగెరెలో ప్రజలు ఎటు చూసిన శోకసముద్రంలో మునిగిపోయారు. 94 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఎంతో చురుకుగా ఎమ్మెల్యేగా పని చేసి అన్ని పార్టీల నాయకులకు స్పూర్తిదాయకంగా నిలిచిన అజాతశత్రువు అని కొనియాడారు. దావణగెరెలో బాపూజీ విద్యాసంస్థలతో పాటు పలు పరిశ్రమలు నెలకొల్పారని ప్రశంసించారు. శామనూరు మృతితో దావణగెరె జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించి సంతాపం ప్రకటించారు. ఒక రాజకీయ, వ్యాపార దిగ్గజుల్లో ఒక్కటై కానరాని లోకాలకు వెళ్లారని ఆయన సన్నిహితులు కన్నీరు పెట్టారు. దావణగెరెతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రముఖులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి సంతాపం ప్రకటించి అంత్యక్రియల్లో పాల్గొని జై శివశంకరప్ప... జోహార్ శివశంకరప్ప అంటూ నినాదాలు చేశారు.
సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం
ప్రభుత్వ లాంఛనాలతో శామనూరుకు వీడ్కోలు


