
సెల్‌ఫోన్‌ను ఒకరోజులో ఎంతసేపు చూస్తున్నాం? అనే విషయాన్ని ఎప్పుడైనా పరిశీలించారా? ఊహూ.. అంత పట్టింపు ఎక్కడిది అంటారా?. పోనీ మరి మీ పిల్లలు?.. అరగంట?.. గంటా..?.. అంత గమనించడం లేదని అంటారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో.. అందులోంచి ఎలా బయటపడేయాలో తెలుస్తుంది!.
ఎయిమ్స్ రాయ్‌పూర్ పరిశోధకులు ఈ మధ్య మెటా అనాలసిస్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను ఎంచుకుని.. వాళ్లు ఫోన్లను ఏయే టైంలో.. ఎంతెంత సేపు వాడుతున్నారు(పేరెంట్స్ సమక్షంలోనే) అనే పదిరకాల అధ్యయాలు జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు క్యూరస్(Cureus) అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. అందులో మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లలు రోజులో దాదాపు రెండున్నర గంటలపాటు(2గం. 22నిమిషాలు) సెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారని తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్(IAP) సూచిస్తున్న సమయం కంటే ఇది రెట్టింపు. మరో భయంకరమైన విషయం ఏంటంటే.. రెండేళ్లలోపు చిన్నారులు రోజులో గంటన్నరపాటు ఫోన్లకు అతుక్కుపోతున్నారట. అసలే ఈ వయసు వాళ్లను ఫోన్లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తుండడం గమనార్హం.
తాజా అధ్యయన నివేదికపై ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యనిపుణుడు స్పందిస్తూ.. పిల్లల్లో 60-70 శాతం సూచించిన సమయం కంటే ఎక్కువ ఫోన్‌పై గడుపుతున్నారు. ఇది వాళ్లపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం చూపెడుతుంది అని అన్నారు. చాలామంది పేరెంట్స్.. కాసేపేగా చూడనిస్తే ఏమైద్దిలే అనుకుంటారు. కానీ, వాళ్లు బిజీ లైఫ్‌లో సెల్‌ఫోన్లకు అతుక్కుపోయి నెమ్మదిగా వాళ్ల పిల్లలకు ఆ అలవాటు చేస్తున్నారు.
.. తినే టైంలోనో.. తమ పనుల్లో మునిగిపోయి పిల్లలను బుజ్జగించేందుకు చేతుల్లో పెడుతున్నారు. కేవలం స్మార్ట్ ఫోన్లతోనే ఆగిపోకుండా డిజిటల్ గాడ్జెట్లను(ట్యాబ్, పీసీ, స్మార్ట్ టీవీలు) అలవాటు చేస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల మాటలు ఆలస్యం కావడం, చూపులో సమస్యలు, ప్రవర్తనలో ఎదుగుదల లేకపోవడం, ఒబెసిటీ సమస్య, నిద్రలేమి, విషయాలపై దృష్టి సారించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి అని తెలిపారాయన.
అయితే ఇది తీవ్రంగా చర్చించదగ్గ అంశమే అయినా.. పరిష్కారం మాత్రం పేరెంట్స్ చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందు తల్లిదండ్రులు ఫోన్‌లో అధిక సమయం గడపడం ఆపాలని సూచిస్తున్నారు.
టెక్ ఫ్రీ జోన్.. తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు.. వాళ్లకు ఫోన్లు, ఇతర గాడ్జెట్లు కనిపించకుండా చూడాలి. ఇందుకోసం బెడ్రూం లేదంటే ఇంటి పరిసరాల్లోకి తీసుకెళ్లాలి. వాళ్లతో మాట్లాడాలి.. మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఆటలు ఆడించాలి. ఏడుస్తున్నారు కదా అని ఫోన్లు చేేతులో పెట్టొద్దు. మరీ ముఖ్యంగా ఏ వయసులో ఎంతసేపు చూడొచ్చు అనే పరిమితికి కట్టుబడి ఉండాలి. అప్పుడే వాళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతారు అని నిపుణులు అంటున్నారు.