న్యూఢిల్లీ: ఢిల్లీ పేరు మార్పు అంశం మరోమారు వార్తల్లో నిలిచింది. ఢిల్లీ బీజేపీ ఎంపి ప్రవీణ్ ఖండేల్వాల్ తాజాగా హోంమంత్రి అమిత్ షాకు దేశరాజధాని ఢిల్లీ పేరును మార్చాలంటూ లేఖ రాశారు. రాజధాని పురాతన మూలాలను అనుసరించి, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఆయన కోరారు. ఇదేవిధంగా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు.
హోంమంత్రి అమిత్ షాతో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులకు కూడా ఈ లేఖ కాపీలను ఖండేల్వాల్ పంపారు. ఈ విధంగా పేరు మార్చడం అనేది చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు.. ఇది భారతీయ నాగరికత ఆత్మ, పాండవులు స్థాపించిన ఇంద్రప్రస్థ నగర సంప్రదాయానికి ప్రతిబింబం.. అని ఆయన ఆ లేఖలో రాశారు. పాండవుల విగ్రహాలను దేశ రాజధానిలో ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అలా చేసినప్పుడే భారతదేశ చరిత్ర, సంస్కృతికి పునరుజ్జీవం వస్తుందన్నారు. ఢిల్లీ నగరం పాండవులు అనుసరించిన నీతి, ధర్మం, ధైర్యానికి చిహ్నంగా నిలిచిందన్నారు.
దేశంలోని ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి తదితర నగరాలు వాటి పురాతన గుర్తింపులతో తిరిగి వెలుగొందుతుండగా, ఢిల్లీ విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని కోరారు. తద్వారా దేశరాజధాని.. జాతీయవాదానికి చిహ్నం అనే సందేశం అందరికీ అందుతుందని ఆ లేఖలో ఆయన రాశారు. గతంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇదే డిమాండ్ చేసింది. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చినప్పుడే దేశరాజధానికి నిజమైన సాంస్కృతిక గుర్తింపు లభిస్తుందని వీహెచ్‌పీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్


