న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
నరేలా ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిపై పగతీర్చుకునేందుకు అతని దగ్గర పనిచేసే డ్రైవర్ నీతు తన యజమాని ఐదేళ్ల కుమారుడిపై ఇటుకలతో దాడి చేసి, కత్తితో తీవ్రంగా గాయపరిచి, హత్య చేశాడు. యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ముందు అతను ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, తన గదిలో ఉంచాడు. ఆ గదిలోని బాలుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్య అనంతరం నిందితుడు నీతు పరారయ్యాడు. అతనిని వెదికేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నీతూను అతని యజమాని తీవ్రంగా మందలించిన దరిమిలా అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
నరేలా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు బాలుని కిడ్నాప్‌పై ఫోన్‌లో ఫిర్యాదు వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ స్వామి తెలిపారు. బాలుడు తమ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారు బాలుని కోసం గాలించగా, అతని మృతదేహం అక్కడికి సమీపంలోని నీతు గదిలో కనిపించిందని హరేశ్వర్ స్వామి వివరించారు.
బాలుని తండ్రి ఎనిమిది రవాణా వాహనాలను నడుపుతూ, నీతు, వసీంలను డ్రైవర్లుగా నియమించుకున్నాడని, సోమవారం సాయంత్రం, మద్యం మత్తులో ఇద్దరు డ్రైవర్లూ గొడవ పడ్డారని, దీనిలో జోక్యం చేసుకున్న యజమాని.. డ్రైవర్ నీతును కొట్టాడని హరేశ్వర్ స్వామి చెప్పారు. ఈ అవమాన భారంతో నీతు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడన్నారు. ఈ ఉదంతం గురించి తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్‌లతో తక్షణ చర్యలు


