ఢిల్లీ కారు పేలుడులో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వైద్యుడు ఉమర్ మొహమ్మద్, ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో రాడికల్ డాక్టర్ల గ్రూపులో సభ్యుడు. ఢిల్లీ పోలీసు వర్గాల ప్రకారం.. ఉమర్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఈ ఉగ్రవాద సంస్థ కీలక సభ్యులుగా భావిస్తున్న ఇద్దరు సహచరులు, వైద్యులు అరెస్టు తర్వాత అతను భయపడి ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడ్డాడని వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న టెలిగ్రామ్.. ఒక మెసేజింగ్ యాప్ లాంటిదే. కానీ ఈ యాప్ భద్రతా పరంగా అంత సురక్షితం కాదు. ఈ కారణంగానే ఇందులో ఉగ్రవాదం, నేర కార్యకలాపాలు, తప్పుడు సమాచారం, జాత్యహంకార ప్రేరేపణలు జరుగుతున్నాయి.
టెలిగ్రామ్‌ను 2013లో రష్యాలో జన్మించిన బిలియనీర్ పావెల్ దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ దురోవ్ స్థాపించారు. చాలా సంవత్సరాల నుంచి ఇది వాడుకలో ఉన్నప్పటికీ.. ఇతర మెసేజింగ్ యాప్స్ అంత సురక్షితం కాలేక పోయింది. ఈ కారణంగానే దీనిని వినియోగించేవారి సంఖ్య క్రమంగా తగ్గింది.
రష్యా దండయాత్రను తిప్పికొట్టడానికి.. తన స్వదేశీయులను సమీకరించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఈ మెసెంజర్‌ను ఉపయోగించుకున్నారు. హాంకాంగ్‌లో.. అణచివేత చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించడానికి అక్కడి కార్యకర్తలు కూడా టెలిగ్రామ్‌ను ఉపయోగించారు. బెలారస్‌లో.. ఎన్నికల మోసానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రజాస్వామ్య అనుకూల శక్తులకు ఈ యాప్ వేదికగా నిలిచింది.


