
ఢిల్లీ: ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 12) ఉదయం 9.30గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు.
పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్‌ఎస్ (4రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది.